తిరుపతి : చిత్తూరు జిల్లా కీలపట్లలోని శ్రీ కోనేటిరాయ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం 9.05 నుండి 9.15 గంటల మధ్య మిథున లగ్నంలో ధ్వజారోహణం నిర్వహించి, సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. గరుత్మంతుని చిత్రంతో అలంకరించిన ధ్వజపటానికి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం వేదమంత్రోచ్చారణల మధ్య గరుత్మంతుని ప్రతిరూపాన్ని కొత్త వస్త్రంపై లిఖించి, పూజలు చేసి, ధ్వజస్తంభంపై ప్రతిష్ఠించారు. ముందుగా గ్రామ పోలిమేరలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించడం జరిగింది.
రాత్రి 7 గంటలకు శేష వాహనంపై స్వామివారు ఊరేగి భక్తులకు దర్శనం ఇచ్చారు. ఇదిలా ఉండగా ఆలయ ప్రాముఖ్యత ఇలా ఉంది. కీలపట్ల శ్రీ కోనేటి రాయస్వామివారి ఆలయం ప్రముఖ పుణ్యక్షేత్రంగా భక్తుల ఆదరణ పొందుతోంది. స్థల పురాణం ప్రకారం బృగు మహర్షి స్వామి వారిని సాలగ్రామ రూపంలో ప్రతిష్ఠించినట్లు చెబుతారు. ఈ ఆలయంలోని స్వామివారి విగ్రహం తిరుమల శ్రీవారి మూ లవిరాట్‌ను పోలి ఉండటం విశేషం. భక్తులు స్వామివారిని దర్శించుకుంటే కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. తాళ్లపాక అన్నమాచార్యులు ఈ క్షేత్రాన్ని దర్శించి సంకీర్తనలు ఆలపించినట్లు చారిత్రకంగా పేర్కొంటారు.
2012 నవంబర్ 19న ఈ ఆలయం టిటిడిలో విలీనం అయిన తరువాత నిత్య కైంకర్యాలు, ఉత్సవాలు మరింత వైభవంగా నిర్వహిస్తున్నారు. ప్రతి రోజూ పెద్ద సంఖ్యలో భక్తులు స్వామి వారిని దర్శించు కుంటున్నారు. ప్రతి శనివారం సుమారు 200 మంది భక్తులు తలనీలాలు సమర్పిస్తున్నారు. భక్తులకు నిత్యం అన్నప్రసాదాలు అందిస్తున్నారు. ప్రతి నెల శ్రవణ నక్షత్రం రోజున కళ్యాణోత్సవం నిర్వహిస్తారు. గృహస్థులు రూ.300 చెల్లించి ఈ సేవలో పాల్గొనవచ్చు. పౌర్ణమి పర్వదినాన ఊంజల్ సేవ కూడా భక్తి భావంతో నిర్వహిస్తున్నారు.


















