న్యూఢిల్లీ : తిరువనంతపురం కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన కేంద్ర సర్కార్ పై నిప్పులు చెరిగారు. పొలిటికల్ డ్రామాలకు తెర దించితే మంచిదని హితవు పలికారు. పార్లమెంట్ లో డీ లిమిటేషన్ కు సంబంధించిన బిల్లు వీగి పోవడం పట్ల స్పందించారు. ఇది విపక్షాలు కలిసికట్టుగా ఎన్డీయేపై సాధించిన ఘన విజయం అని పేర్కొన్నారు. ఇవాళ శశి థరూర్ జాతీయ మీడియాతో మాట్లాడారు. ఇది చాలా ఘనమైన విజయం. రాజ్యాంగ సవరణను ఆమోదించడానికి అవసరమైన మూడింట రెండు వంతుల మెజారిటీకి బీజేపీ 52 ఓట్ల తేడాతో వెనుకబడింది…మేము ఒకరకమైన విజయోత్సాహాన్ని అనుభవిస్తున్నామని అన్నారు ఎంపీ.
ఇది మహిళా రిజర్వేషన్‌కు వ్యతిరేకంగా వేసిన ఓటు కాదని స్పష్టం చేశారు, నియోజకవర్గాల పునర్విభజనకు, ఆ పునర్విభజన, పార్లమెంటు నాటకీయ విస్తరణ మన ప్రజాస్వామ్యానికి చేసే కీడుకు వ్యతిరేకంగా వేసిన ఓటుగా భావించాల్సి ఉంటుందన్నారు. అందుకే మన ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి తాము ఓటు వేయడం జరిగిందన్నారు. ఆ విషయం గుర్తిస్తే మంచిదన్నారు. మీరు మహిళా రిజర్వేషన్‌ను నియోజకవర్గాల పునర్విభజన నుండి వేరు చేస్తే, తాము దానికి అనుకూలంగా ఓటు వేస్తామని ముందే చెప్పడం జరిగిందన్నారు శశి థరూర్.















