కరీంనగర్ జిల్లా : తెలంగాణలో బిజెపి అధికారంలోకి రావాలని ఆ రామయ్యను కోరుకున్నానని అన్నారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. హుజురాబాద్ నియోజకవర్గం ఇల్లందకుంట శ్రీ సీతారామ చంద్రస్వామి వారి రథోత్సవంలో పాల్గొని, ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు చెల్లించుకున్నారు .శ్రీ సీతారామ చంద్రస్వామి ఆలయం శ్రీరాముడు నడయాడిన ప్రాంతంగా పేరుగాంచిన స్వయంభు దేవాలయం అని ప్రశంసించారు . వందల సంవత్సరాల క్రితం ఈ దేవాలయం రూపు దిద్దుకుందన్నారు ఎంపీ. ఈ చుట్టుపక్క ప్రాంత ప్రజలందరూ వేలాది గా తరలివచ్చి సీతా రామచంద్ర స్వామి కళ్యాణోత్సవం మొదలుపెట్టి రథోత్సవం వరకు గొప్పగా నిర్వహించు కోవడం ఆనందంగా ఉందన్నారు.
జై శ్రీరామ్ నినాదాలతో ఈ ప్రాంతమంతా దద్దరిల్లుతుండడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు ఈటల రాజేందర్. ఈ ఆలయాన్ని గొప్పగా నిర్మించు కోవాలని పాత ఆలయానికి సౌకర్యాలు పెంచి గ్రామస్తుల సహకారంతో గొప్ప రథాన్ని నిర్మాణం చేసుకున్నామని తెలిపారు. ఈ ఆలయ ప్రాంగణమంతా కొన్ని కోట్ల రూపాయలతో బాగు చేయించామన్నారు. వేలాది మంది ఇక్కడ పెళ్లిళ్లు చేసుకుంటారని, అనేక దైవిక కార్యక్రమాలు జరుపుకునేందుకు వీలుగా ఈ ప్రాంత ప్రజలకు సౌకర్యాలు ఉండాలని రెండు పెద్ద షెడ్డులు నిర్మాణం చేయడం జరిగిందన్నారు. ఒక మాటలో చెప్పాలంటే ఈ ఆలయంలో నేను ఇక్కడ ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న కాలంలో గొప్పగా అభివృద్ధి చేశామని చెప్పారు ఈటల రాజేందర్.



















