ఒంటిమిట్ట / తిరుపతి : ఒంటిమిట్ట శ్రీ కోదండరా మస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారి రథోత్సవం కన్నుల పండువగా జరిగింది .ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైన ఈ రథోత్సవంలో శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండ రాములవారు రథాన్ని అధిష్టించి గ్రామ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. భజన బృందాలు చెక్క భజనలు, కోలాటాలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత భక్తి రసమయం చేశాయి. భక్తులు భక్తి శ్రద్ధలతో రథాన్ని లాగుతూ అడుగడుగునా కర్పూర నీరాజనాలు సమర్పించారు.
రథోత్సవానికి ఉన్న ఆధ్యాత్మిక ప్రాధాన్యం విశేషం. ఆత్మ రథికుడు, శరీరమే రథం, బుద్ధి సారథి, మనస్సు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులని భావించి, ఆత్మ–అనాత్మ వివేకాన్ని గ్రహించేందుకు ఈ ఉత్సవం మార్గదర్శకంగా నిలుస్తుంది.
ఇదిలా ఉండగా శ్రీ కోదండ రామ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఆధ్వర్యంలో కనీవిని ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేశారు. ఉత్సవాలలో ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీ సీతా రామ, లక్ష్మణులకు పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సారి కూడా సీఎం నారా చంద్రబాబు నాయుడు , కుటుంబీకులు స్వయంగా వస్త్రాలను సమర్పించారు. కళ్యాణోత్సవం నభూతో నభవిష్యత్ అన్న రీతిలో జరిగింది. దాదాపు 80 వేలకు పైగా భక్త బాంధవులు హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవోలు వి వీరబ్రహ్మం, డా.ఎ.శరత్, డెప్యూటీ ఈవో ప్రశాంతి, టెంపుల్ ఇన్స్పెక్టర్ నవీన్, ఇంజినీరింగ్ అధికారులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.



















