Simhachalam Giri Pradakshina : విశాఖపట్నంలోని సింహాచలం లోర్డ్ నర్సింహస్వామివారి గిరి ప్రదక్షిణ ఉత్సవం బుధవారం రాత్రి ఘనంగా ప్రారంభమైంది. ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు లాంఛనంగా ఈ పవిత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గణబాబు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పాల్గొన్నారు.
Simhachalam Giri Pradakshina Interesting Updates
ఈ సందర్భంగా సింహాచలం (Simhachalam) పరిసరాలు గోవింద నామస్మరణతో మారుమోగుతున్నాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా భక్తులు పెద్దఎత్తున గిరి ప్రదక్షిణలో పాల్గొంటూ విశేష ఉత్సాహాన్ని చూపుతున్నారు. సుమారు 32 కిలోమీటర్ల ఈ గిరిప్రదక్షిణ మార్గం తొలిపావంచా దగ్గర ప్రారంభమై, అడవివరం, ముడుసర్లోవ, హనుమంతువాక, వెంకోజిపాలెం కూడలి, సీతమ్మధార, మాధవధార, NAD జంక్షన్, గోపాలపట్నం, పాతగోశాల మీదుగా సింహాచలం ఆలయానికి చేరుతుంది.
ఈ గిరిప్రదక్షిణ తెల్లవారుజాము వరకు కొనసాగనుంది. భక్తులు ఆలయ ప్రాంగణానికి చేరుకున్న తర్వాత, ఆషాడ పౌర్ణమి సందర్భంగా సింహాద్రి అప్పన్న స్వామికి తుది విడత చందనోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు.
భక్తుల భద్రతకు ప్రత్యేక ఏర్పాట్లు
సింహాచలం గిరిప్రదక్షిణ కోసం అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. భద్రత, నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణ కోసం కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పోలీసు అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు. ట్రాఫిక్ నియంత్రణ, తాగునీరు, ఆరోగ్య సౌకర్యాలు, మున్సిపల్ నిర్వహణ వంటి అంశాల్లో విస్తృత స్థాయిలో చర్యలు తీసుకున్నారు.
లక్షలాది భక్తుల సందడి
అంచనాల ప్రకారం ఈ సంవత్సరం మూడు నుంచి నాలుగు లక్షల భక్తులు గిరిప్రదక్షిణలో పాల్గొనే అవకాశం ఉంది. ఇప్పటికే వేల సంఖ్యలో భక్తులు విశాఖ చేరుకున్నారు. కొందరు గుడారాలు వేసుకొని విశ్రాంతి తీసుకుంటుంటే, మరికొందరు నడకలో మునిగిపోయి భక్తిశ్రద్ధలతో ‘గోవిందా.. గోవిందా’ నినాదాలతో ముందుకు సాగుతున్నారు.
ఈ మహోన్నత కార్యక్రమం ఆధ్యాత్మికత, శ్రద్ధ, భక్తి, సమైక్యతకు ప్రతీకగా నిలుస్తోంది. గిరిప్రదక్షిణ పూర్తయిన అనంతరం సింహాచల క్షేత్రం మరింత భక్తులతో కిటకిటలాడే అవకాశం ఉంది.
Also Read : Popular Simhachalam Giri Pradakshina : అప్పన్న గిరి ప్రదక్షిణ విజయవంతం చేద్దాం



















