అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేశారు. లబ్దిదారులకు తీపికబురు చెప్పారు. త్వరలోనే 1,00,875 టిడ్కో ఇళ్లకు గృహ ప్రవేశం జరిగేలా చూస్తామన్నారు. పురమిత్ర యాప్ ద్వారా అందుతున్న ఫిర్యాదులను బట్టి, ఎక్కువ ఫిర్యాదులు వచ్చిన ప్రాంతాన్ని హాట్ స్పాట్‌గా గుర్తించి స్థానిక అధికారులు అక్కడ పర్యటించి సమస్యలు పరిష్కరించేలా చూడాలని సీఎం ఈ సందర్భంగా సూచించారు. ప్రజాభిప్రాయం తెలుసు కోవడంతో పాటు, అధికారులు తమ పనితీరు మెరుగు పరుచుకునేలా వ్యవస్థను తీర్చిదిద్దాలన్నారు. సీసీ కెమెరా విజువల్స్, డ్రోన్ షాట్స్, శాటిలైట్ మ్యాప్స్ వంటి విషయాల్లో డేటా ఇంటిగ్రేషన్ జరగలన్నారు. అన్ని మున్సిపాలిటీల్లో మున్సిపల్ బాండ్స్ జారీతో పాటు, అర్బన్ అథారిటీ ఏర్పాటుపై దృష్టి పెట్టాలని సూచించారు.
పట్టణాలు, నగరాల్లో 484 కి.మీ మేర రహదారులు అభివృద్ధి చేయాల్సి ఉండగా వాటిలో ముందుగా రాజమండ్రి, విశాఖపట్నం, గుంటూరు, విజయవాడ, తిరుపతిలో చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్రంలో 123 యూఎల్బీలు ఉంటే 100 చోట్ల మాత్రమే గతంలో ఎన్నికలు జరిగాయని… ఇందులో 13 కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలు ఉన్నాయని… మరో 4 కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగలేదని తెలిపారు. ఈ మార్చి 17 నాటికి 86 యూఎల్బీల్లో పాలక సంస్థల కాలపరిమితి ముగిసిందని వివరించారు. గోదావరి పుష్కరాల దృష్ట్యా… రాజమండ్రి, కొవ్వూరు, నిడదవోలును కలుపుతూ అఖండ గోదావరి ప్రాజెక్టు చేపట్టాలన్నారు. స్వర్ణముఖి, కపిల తీర్థం జల వనరులతో తిరుపతిలో సమర్ధ నీటి నిర్వహణ జరగాలని సీఎం అన్నారు. విజయవాడ-అమరావతి కెనాల్ సిటీలుగా, విశాఖ బీచ్ సిటీగా తీర్చిదిద్దాలని చెప్పారు.
















