హైదరాబాద్ : ఎవరు ఎన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినా తాము ఆపే ప్రసక్తి లేదన్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. హైదరాబాద్ నగర నాగరికత, సాంస్కృతిక వారసత్వాన్ని భవిష్యత్తు తరాలకు అందించాలన్న సంకల్పంతో, మురికి కూపంగా మారిన మూసీ నదిని పునరుజ్జీవింప చేయాలని నిర్ణయం తీసుకున్నామని ఇందులో మార్పు అన్నది లేదన్నారు . గొప్ప తలంపుతో, మూసీ దిగువన ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజల కాలుష్య వెతలకు శాశ్వత పరిష్కారం ఇవ్వాలన్న మానవత్వంతో ప్రజా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక “మూసీ పునరుజ్జీవం – రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్” ప్రాజెక్టు తలపెట్టిందని చెప్పారు.
ఈ ప్రాజెక్టు పై కొందరు వ్యక్తులు, ప్రతిపక్ష పార్టీల నాయకులు అసత్యాలు, అర్ధ సత్యాలతో ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారంటూ ఆరోపించారు. ఈ నేపథ్యంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రజలకు వాస్తవాలు వివరించే ప్రయత్నం చేశామని తెలిపారు సీఎం. ప్రముఖులు, పర్యావరణవేత్తలు, మీడియా ప్రతినిధులు, ప్రజా సంఘాల సమక్షంలో ప్రభుత్వ విజన్ ను, వాస్తవ అంశాలను స్పష్టంగా తెలంగాణ సమాజం ముందు ఆవిష్కరించడం జరిగిందన్నారు.
మూసీ ఇన్వైట్స్ పేరుతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు . తమ ఆలోచనను సమాజం ముందు పెట్టాం అన్నారు. మూసీ పునరుజ్జీవం ఇప్పుడు ఛారిత్రక అవసరం అన్నారు. మా ప్రభుత్వం ప్రజలను నొప్పించి, పేదలను ఇబ్బంది పెట్టే ఏ పని చేయదన్నారు. ప్రతి అభివృద్ధి వెనుక కొంత మందికి ఇబ్బంది కలగడం సహజం అన్నారు సీఎం. ఆ ఇబ్బందులకు పరిష్కారం చూపించడానికి మేం సిద్ధంగా ఉన్నాం అని ప్రకటించారు. ఆ పరిష్కారం పై ఎవరు సలహాలు, సూచనలు ఇచ్చినా తీసుకోవడానికి మేం సిద్ధంగా ఉన్నామన్నారు.


















