హైదరాబాద్ : సీఎం ఎ. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక నుంచి ఆయా ప్రభుత్వ శాఖల పరంగా డీజిల్, పెట్రోల్ వాహనాలు వాడేందుకు వీలు లేదన్నారు. ఒక రకంగా బిగ్ షాక్ ఇచ్చారు. ప్రస్తుతం కేంద్రంతో పాటు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎంలు పనిగట్టుకుని ఎలక్ట్రిక్ వాహనాల జపం చేస్తున్నారు. ఈ తరుణంలో ప్రభుత్వ శాఖలు ఇక నుంచి తప్పనిసరిగా ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే కొనుగోలు చేయాలని ఆదేశించారు. కాలుష్య రహిత రవాణా వ్యవస్థ లక్ష్యంగా పని చేయాలని చెప్పారు.కోర్ అర్బన్ ఏరియా పరిధిలోని ప్రభుత్వ శాఖలు అద్దెకు తీసుకునే వాహనాలు సైతం ఈవీలే ఉండాలని . స్పష్టం చేశారు. రవాణా శాఖలోని మాన్యువల్ విధానాలకు స్వస్తి చెప్పాలని, మొత్తం ఆన్‌లైన్‌లోనే కార్యకలాపాలు కొనసాగించాలని కుండ బద్దలు కొట్టారు.
కమాండ్ కంట్రోల్ రూమ్ వేదికగా రాష్ట్ర రవాణా శాఖ పనితీరుపై మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, రవాణా శాఖ కమిషనర్, ఉన్నతాధికారులతో కలిసి సమీక్ష చేపట్టారు సీఎం. ఆర్‌టీవో కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగడానికి వీల్లేదని అన్నారు. వెంటనే సొంత భవనాల నిర్మాణాలకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆదేశించారు. రోడ్డు ప్రమాదాలపై అవగాహన పెంచాలని, ప్రజల్లో చైతన్యం తేవడానికి షార్ట్ ఫిల్మ్‌లు ప్రదర్శించాలని సూచించారు. శంషాబాద్ సమీపంలో హైస్పీడ్ రైలు కారిడార్ ప్రారంభమయ్యే ప్రాంతంలో అధునాతన బస్ టెర్మినల్‌కు స్థలం కేటాయిస్తామని ప్రకటించారు. అందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు.


















