అమరావతి : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. కేంద్రంలోని మోదీ బీజేపీ సర్కార్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కావాలని జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేశారని ఆరోపించారు. ఇదిలా ఉండగా ఏపీపీసీసీ ఆధ్వర్యంలో చేపట్టిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్ట (MGNREGA) పరిరక్షణ యాత్ర కృష్ణా జిల్లాలో సాగింది. గుడివాడ నియోజకవర్గం కవతవరం కు చేరుకుంది. అదేవిధంగా అవనిగడ్డలో జరిగిన రచ్చబండలో ఉపాధి హామీ శ్రామికులు హాజరై 100 రోజుల పని తీరు తెన్నులను ఏకరువు పెట్టారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన నిర్లక్ష్యాలను ఎండగట్టారు. తమ జిల్లాలో మన్రేగా పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసిన దాఖలాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. చేసిన పనికి వేతనాలు సైతం ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
గత 10 ఏళ్లుగా రాష్ట్రంలో ఇదే తంతు కొనసాగుతుందని, 100 రోజుల పనినే సక్రమంగా ఇవ్వలేని వాళ్లు.. ఇప్పుడు 125 రోజులు ఇస్తామంటే నమ్మలేమన్నారు. గాంధీ గారి పేరు తొలగించడం జాతిపితకు చేసిన ద్రోహమని ఆగ్రహం వ్యక్తం చేవారు. మోదీ తెచ్చిన కొత్త చట్టం VB G- RAM G ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లో త్రాగేందుకు గుక్కెడు నీళ్లు లేవని, అర్హులైన వారికి పెన్షన్లు లేవని, సూపర్ సిక్స్ పథకాలు అందలేదని, నిరుద్యోగం పెరిగి మళ్లీ వలసలు పోవాల్సి వస్తుందని ప్రజలు చెప్పడం చంద్రబాబు పాలన వైఫల్యానికి నిదర్శనం అన్నారు వైఎస్ షర్మిలా రెడ్డి.















