అమరావతి : మగ్గం మీదే నేసే వస్త్రాలను మాత్రమే ఆప్కో ద్వారా కొనుగోలు చేస్తామని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టం చేశారు. ఆప్కో బ్రాండ్ మరింత పెంచేలా షో రూమ్ ల్లో నాణ్యమైన చేనేత వస్త్రాలను మాత్రమే విక్రయించనున్నామని కుండ బద్దలు కొట్టారు మంత్రి. విజయవాడలోని ఓ ప్రైవేటు హొటల్ లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 70 చేనేత సహకార సంఘాల ప్రతినిధులతో రాష్ట్ర చేనేత, జౌళి శాఖాధికారులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రూ.కోటీ 70 లక్షల విలువైన చేనేత వస్త్రాలను ఈ సమావేశానికి చేనేత సహకార సంఘాల ప్రతినిధులు తీసుకొచ్చారు. వాటిని పరిశీలించిన అధికారులు, కేవలం మగ్గంపైనే నేసిన రూ.కోటీ 40 లక్షల విలువైన చేనేత వస్త్రాలను అక్కడికక్కడే కొనుగోలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి సవిత మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో చేనేత రంగ అభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయుడు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. ఆప్కో బ్రాండ్ ను మరింత విస్తరించే క్రమంలో ఆయా షో రూమ్ ల్లో కేవలం మగ్గం మీద నేసే చేనేత వస్త్రాలను మాత్రమే విక్రయించనున్నట్లు తెలిపారు. పవర్ లూమ్ మగ్గాల మీద నేసే వస్త్రాలను ఆప్కో షో రూమ్ ల్లో విక్రయించేది లేదని స్పష్టం చేశారు. దీనిలో భాగంగానే మగ్గం మీద నేసే చేనేత వస్త్రాలను మాత్రమే చేనేత సహకార సంఘాల నుంచి కొనుగోలు చేస్తామన్నారు ఎస్. సవిత. ఈ నిర్ణయం వల్ల నేతన్నలకు ఎంతో మేలు కలుగుతుందన్నారు. ఏడాది పాటు ఉపాధి లభించే అవకాశం కలుగుతుందని చెప్పారు.
















