అమరావతి : రాష్ట్రంలో బుల్లితెర కళాకారులు ఎదుర్కొంటున్న సమస్యలను సాధ్యమైనంత త్వరలో పరిష్కరించేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు రాష్ట్ర పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్. వెలగపూడి సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో టెలివిజన్ ఫ్రెటర్నిటీ ఫోరమ్ ప్రతినిధులు, ఎఫ్‌డీసీ ఎండీ విశ్వనాథన్ తో కలిసి బుల్లితెర కళాకారులు ఎదుర్కొంటున్న సమస్యలు, టెలివిజన్ పరిశ్రమ అభివృద్ధికి సంబంధించిన అంశాలను వివరించారు. గత నాలుగు దశాబ్దాలుగా టెలివిజన్ రంగం రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి, వేలాది కళాకారులకు ఉపాధి కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. . చలనచిత్ర పరిశ్రమతో సమానంగా టీవీ రంగానికి కూడా తగిన గుర్తింపు, గౌరవం కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రకటించారు కందుల దుర్గేష్.
విశాఖపట్నం జిల్లా భీమిలి వద్ద కేటాయించిన స్థలంలో “టీవీ నగర్” ఏర్పాటు, స్టూడియోలు నిర్మాణం వంటి ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలిస్తామని అన్నారు. అలాగే అమరావతి, విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి ప్రాంతాల్లో స్టూడియోల ఏర్పాటుకు ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. పెండింగ్‌లో ఉన్న టీవీ నంది అవార్డులు త్వరలోనే ప్రదానం చేయడంతో పాటు ఉగాది పురస్కారాల్లో టీవీ కళాకారులకు తగిన ప్రాధాన్యత కల్పించే దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పారు కందుల దుర్గేష్. దివంగత ప్రముఖులు సుమన్ , దేవదాస్ కనకాల పేర్లతో కళాకారులను సత్కరించే ప్రతిపాదనను కూడా పరిశీలిస్తాం అన్నారు.
షూటింగ్స్ కోసం ప్రభుత్వ స్థలాలు, ఆడిటోరియాలు, దేవాలయాల వద్ద ఇప్పటికే రాయితీలు కల్పిస్తున్నాం అని తెలిపారు. భవిష్యత్తులో టూరిజం గెస్ట్ హౌస్‌లలో కూడా రాయితీలు కల్పించే దిశగా నిర్ణయం తీసుకుంటాం అన్నారు. టెలివిజన్ పరిశ్రమకు ప్రభుత్వం మధ్య వారధిగా టెలివిజన్ ఫ్రెటర్నిటీ ఫోరమ్ ను అనుసంధాన కమిటీగా గుర్తించే అంశాన్ని కూడా పరిశీలిస్తామని చెప్పారు కందుల దుర్గేష్. ఈ అంశాలన్నింటినీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన అమలు చేసేలా కృషి చేస్తామని పేర్కొన్నారు కందుల దుర్గేష్.



















