కోల్ కతా : ప్రపంచ విజేత కావాలని అనుకున్న దక్షిణాఫ్రికా జట్టు ఆశలపై నీళ్లు చల్లాడు న్యూజిలాండ్ కు చెందిన ఫిన్ అలెన్. ఆకాశమే హద్దుగా ఆడాడు. పిచ్చ కొట్టుడు కొట్టాడు. కేవలం 33 బంతులు మాత్రమే ఎదుర్కొన్న తను 10 ఫోర్లు 8 సిక్సర్లతో విరుచుకు పడ్డాడు. దీంతో ఏం చేయాలో తోచక దక్షిణాఫ్రికా చూస్తూ ఉండి పోయింది. కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ సఫారీలకు కోలుకోలేని షాక్ ఇచ్చింది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన దక్షిణాఫ్రికాను నిర్ణీత 20 ఓవర్లలో 169 పరుగులకే కట్టడి చేసింది. అనంతరం 170 రన్స్ టార్గెట్ ను కేవలం 12.5 ఓవర్లలోనే పని పూర్తి చేసింది. దీంతో విధ్వంసకరమైన ఆట తీరుతో చుక్కలు చూపించిన ఫిన్ అలెన్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది.
పొట్టి ప్రపంచ కప్ లో న్యూజిలాండ్ ఆటగాడు ఫిన్ అలెన్ అరుదైన రికార్డు నమోదు చేశాడు. మరో వైపు అలెన్ తో పాటు టిమ్ సిఫర్ట్ 33 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు 2 సిక్స్ లతో 58 రన్స్ చేశాడు. ఈ ఇద్దరూ కలిసి జట్టుకు అద్భుత విజయాన్ని నమోదు చేశారు. ఏకంగా వరల్డ్ కప్ ఫైనల్ కు చేర్చారు. ఇక ముందుగా బ్యాటింగ్ కు దిగిన సౌతాఫ్రికా జట్టు కీవీస్ బౌలర్లను ఎదుర్కోవడంలో నానా తంటాలు పడింది. మార్కో యాన్సెస్ 30 బంతులలో 55 రన్స్ చేశాడు. ఇందులో 2 ఫోర్లు, 5 సిక్సులు ఉన్నాయి. తనతో పాటు బ్రెవిస్ 27 బంతులలో 3 ఫోర్లు 2 సిక్స్ లతో 34 పరుగులు చేశాడు.



















