అమరావతి : ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన చేశారు. ఏలూరు జిల్లాలో 500 ఎకరాల్లో కోకో సిటీ ఏర్పాటు చేస్తామన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కోకో ఉత్పత్తులను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. రూ.13.82 కోట్లతో ఫెర్మెంటేషన్ యూనిట్లు, సోలార్ డ్రైయర్లు, ప్రాసెసింగ్ యూనిట్లు అందిస్తున్నామని చెప్పారు. రాష్ట్రాన్ని 24 ఉద్యాన క్లస్టర్లుగా విభజించి 22 గ్రోత్ ఇంజిన్ పంటలకు ప్రాధాన్యత ఇస్తున్నామని వెల్లడించారు. కేంద్రానికి పంపిన ప్రతిపాదనల్లో రూ.564 కోట్ల విలువైన 8 ప్రాజెక్టులు ఆమోదం పొందినట్లు తెలిపారు.
సాంప్రదాయంగా పట్టు ఉత్పత్తి చేసే రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ దేశంలో రెండవ అతిపెద్ద రాష్ట్రంగా నిలిచిందని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1.52 లక్షల ఎకరాల్లో పట్టు సాగు జరుగుతోందని అన్నారు. 2025-26లో షెడ్యూల్డ్ తెగల పట్టు రైతులకు 90% రాయితీతో రూ.2.98 కోట్లు, షెడ్యూల్డ్ కులాల పట్టు రైతులకు రూ.1.92 కోట్లు వ్యయంచేసి ప్రత్యక్ష మద్దతు అందించామని వెల్లడించారు. పట్టు రైతుల ఆదాయం పెంపుతో పాటు గ్రామీణ ఉపాధి అవకాశాలు విస్తరిస్తున్నాయని చెప్పారు. పట్టు పరిశ్రమ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి 2026-27 సంవత్సరానికి రూ.95.87 కోట్ల బడ్జెట్ కేటాయించామని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రైతు సంక్షేమం, ఎగుమతుల ప్రోత్సాహం మరియు గ్రామీణ ఆర్థిక వృద్ధి దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

















