అమరావతి : ప్రముఖ ప్రవచనకర్త, పద్మశ్రీ గరికపాటి తాజాగా తెలుగు భాషపై చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. చర్చకు దారి తీశాయి. దీనిపై తీవ్రంగా స్పందించారు భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ అంటే తెలుగు కాదా అని ప్రశ్నించారు. రామాయణ కాలం నుంచి ఆంధ్ర అనే పదం ఉందని , ఆ విషయం తెలుసుకోకుండా ఎలా పడితే అలా మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు కమలానంద భారతి.
అడిగేవాళ్లు లేరని అధిక ప్రసంగాలు చేస్తున్నారంటూ గరికపాటిపై నిప్పులు చెరిగారు. వింత పోకడలు, వింత ఆలోచనలు మంచిది కాదని హితవు పలికారు. తెలుగునాడు అని మార్చినా సెంటిమెంట్ ఏమీ రాదన్నారు. ఇలాంటి మేధావులే ఏపీకి మద్రాస్ రాకుండా చేశారని సంచలన ఆరోపణలు చేశారు కమలానంద భారతి. గరికపాటి తెలంగాణలో సెటిలయ్యారని, ఆయన ఇక ఆంధ్రాకు రారన్నారు. మా ప్రాంతం.. మా బ్రతుకులు ఎలా ఉండాలో మాకు తెలుసని తను ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీ లేదన్నారు భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతి.
తను ఓ ప్రవచనకర్త అన్న విషయం మరిచి పోయి తనకు తోచిన రీతిలో మాట్లాడుతూ పోతే ఎలా అని నిలదీశారు. హిందూ సమాజానికి ప్రత్యేకించి తెలుగు సమాజానికి మీరు చెప్పదల్చుకున్నది ఏమిటో మీరు ముందుగా అర్థం చేసుకోవాలని సూచించారు పీఠాధిపతి.















