అమరావతి : రేయింబవళ్లు లా అండ్ ఆర్డర్ ను పరిరక్షించడంలో పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రశంసలు కురిపించారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత. శుక్రవారం మంగళగిరిలో 6th బెటాలియన్ ఏపీఎస్పీ ఆధ్వర్యంలో రెండవ ఆల్ ఇండియా పోలీస్ సౌత్ జోన్ టి20 క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, కేవీ మోహన్ రావు, అనుబ్ రాజన్ పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి టి20 టోర్నమెంట్లో పాల్గొన్నారు పోలీసులు. ఆరు రాష్ట్రాల నుండి 10 జట్లు పాల్గొన్నాయి. ఈ సందర్బంగా పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు హోం మంత్రి. ఐదు రోజులు పాటు మూలపాడు గ్రౌండ్లో జరగనుంది టోర్నీ. పోలీసులను ఉద్దేశించి వంగలపూడి అనిత ప్రసంగించారు.
పోలీసులు అనునిత్యం విధులు నిర్వహిస్తూ ఉంటారని, వారి సంక్షేమం కోసం తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. వారి గురించి ఎంత చెప్పినా తక్కువేనని అన్నారు. పోలీసులకు ఇలాంటి క్రీడలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. పోలీసులకు క్రీడలు నిర్వహించడం వలన, వారిలో ఐక్యత పెరుగుతుందని అన్నారు. అమరావతి అంటేనే ప్రజల రాజధాని అని పేర్కొన్నారు. రాజధానిని ప్రపంచ రాజధానిగా మార్చడానికి సీఎం చంద్రబాబు ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు వంగలపూడి అనిత.క్రీడా స్ఫూర్తిని పెంపొందించడానికి ఈ క్రీడలు ఎంతగానో దోహద పడతాయన్నారు.















