న్యూ ఢిల్లీ : సన్ మైక్రోసిస్టమ్స్ వ్యవస్థాపకుడు వినోద్ ఖోస్లా సంచలన వ్యాఖ్యలు చేశారు . దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ ఏఐ సమ్మిట్ 2026లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఏఐ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. వచ్చే అయిదు సంవత్సరాలలో ఐటీ, బీపీఓ రంగాలపై తీవ్ర ప్రభావం పడనుందన్నారు. ఈ కంపెనీల స్థానాలను కృత్రిమ మేధ (ఏఐ) ఆక్రమిస్తుందని స్పష్టం చేశారు. అప్పటి వరకు ఇలాగే కంపెనీలను నిర్వహిస్తూ పోతే చివరకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. తాజాగా వినోద్ ఖోస్లా చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి ఐటీ ఇండస్ట్రీని. ఇప్పటికే ఏఐ దెబ్బ అబ్బా అనిపించేలా ఉంది. ఈ తరుణంలో ప్రపంచ బిలియనీర్ చేసిన కామెంట్స్ మరింత దుమారం రేపాయి.
ఏఐ ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై భారీ ప్రభావాన్ని చూపించనుందని అభిప్రాయపడ్డారు. రానున్న 15 నుంచి 20 ఏళ్లలో చాలావరకు సేవలు ఉచితం కూడా కావచ్చని తెలిపారు వినోద్ ఖోస్లా. కార్మికుల స్థానంలో భర్తీ చేసే రోబోలకు చెల్లించే ఖర్చు చాలా తక్కువగా ఉండనుందని స్పష్టం చేశారు. ఇప్పటికే అమెరికా, తదితర దేశాలలోని కంపెనీలలో రోబోల వినియోగం కొనసాగుతోంది. వీటిని ఉపయోగించడం వల్ల మనుషుల అవసరం లేకుండా పోతోంది. భవిష్యత్‌లో ప్రభుత్వాలు ఉద్యోగ కల్పనపై దృష్టి పెట్టడం, ఉద్యోగం కోసం చదవడం అనేవి సరైన ఆలోచన కాకపోవచ్చంటూ బాంబు పేల్చారు వినోద్ ఖోస్లా.















