అమరావతి : ఏపీలో పర్యటిస్తున్నారు ప్రముఖ ఐటీ దిగ్గజం, బిల్ గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్. సోమవారం ఆయనకు ఘన స్వాగతం పలికారు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు లోకేష్, ఇతర మంత్రులు, సీఎస్ విజయానంద్. ఈ సందర్బంగా తమ గేట్స్ ఫౌండేషన్ సహకారంతో చిత్తూరు జిల్లాలో నడుస్తున్న సంజీవని ప్రాజెక్టు అమలును అడిగి తెలుసుకున్నారు బిల్ గేట్స్ . బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్ లాంటి పరీక్షల వివరాలను ఎలా నమోదు చేస్తున్నారని ప్రశ్నించారు.
కుప్పంలో అమలు చేసిన సంజీవని ప్రాజెక్టు చాలా చక్కగా ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తూ దట్స్ నైస్ అంటూ వ్యాఖ్యానించారు బిల్ గేట్స్.
ప్రజల డిజిటల్ హెల్త్ రికార్డులను అనుసరించి వారి లైఫ్ స్టైల్, ఆహారం తదితర అంశాల్లో సలహాలు ఇస్తున్నామని తెలిపారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్. ఏఐ వినియోగంతో ప్రజారోగ్య సేవలను మరింత మెరుగు పరిచేలా చూస్తున్నామని తెలిపారు సీఎం చంద్రబాబు నాయుడు. గ్రేట్ అంటూ కితాబిచ్చారు బిల్ గేట్స్ . బయో డిజైన్ ద్వారా వైద్య సేవలు అందించే విధానాలను అడిగి తెలుసుకున్నారు. డయాగ్నోస్టిక్ సేవలు తక్కువ వ్యయానికే అందితే పేదలకు వెసులుబాటు ఉంటుందని స్పష్టం చేశారు బిల్ గేట్స్. ప్రజా రాజధాని అమరావతి నిర్మాణ వివరాలను అడిగి తెలుసుకున్నారు . రాజధానిలో 30 శాతం గ్రీన్ అండ్ బ్లూ ప్రణాళిక బాగుందంటూ బిల్ గేట్స్ వ్యాఖ్యానించారు. రాజధాని నిర్మాణ తీరును బిల్ గేట్స్‌కు వివరించారు సీఎం.

















