ఖమ్మం జిల్లా : ప్రముఖ రచయిత బొగ్గుల శ్రీనివాస్ మృతి చెందారు. ఆయన వయసు 50 ఏళ్లు. తన మృతి పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటన ఖమ్మం జిల్లా పాలేరులో చోటు చేసుకుంది. బొగ్గుల శ్రీనివాస్ ప్రయాణం చేస్తున్న కారు పాలేరు రిజర్వాయర్ లోకి దూసుకు వెళ్లింది. క్రేన్ సహాయంతో నీట మునిగిన కారును పోలీసులు వెలికి తీశారు. కారులో వెనుక సీటులో కూర్చున్నారు బొగ్గుల శ్రీనివాస్. తన స్వస్థలం ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ జిల్లా నందికొట్కూరు. రిజర్వాయర్ లో బొగ్గుల శ్రీనివాస్ మృతదేహం ఉండగా, డ్రైవర్ ప్రాణాలతో బయటపడి పారిపోయాడు. దీంతో ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. శ్రీనివాస్ పదేళ్లుగా హైదరాబాదులో ఉంటున్నారు.
పవన్ కల్యాణ్ రాజకీయ ప్రవేశ సమయంలో పవన్ కల్యాణ్ హటావో, పాలిటిక్స్ బచావో పేరుతో బొగ్గుల శ్రీనివాస్ పుస్తకం రాశారు. ఆయన రాసిన పుస్తకం వివాదాస్పదంగా మారింది. ఆ సమయంలో పవన్ కల్యాణ్ అభిమానుల నుంచి తనకు ప్రమాదం ఉందంటూ ఆయన పోలీసులను కూడా ఆశ్రయించారు. చివరకు ఇలా మృతి చెందడంతో తోటి స్నేహితులు, రచయితలు, కవులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై విచారణ జరిపించాలని కోరుతున్నారు.
















