హైదరాబాద్ : తమ ప్రజా ప్రభుత్వం తెలుగు చలన చిత్ర పరిశ్రమ అభివృద్దికి కృషి చేస్తుందని స్పష్టం చేశారు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఈరోజు ‘గద్దర్ ఫిలిం అవార్డ్స్’ జ్యూరీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఏ సమస్య వచ్చినా తాము పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. హైదరాబాద్ నగరాన్ని దేశవ్యాప్త చలనచిత్ర పరిశ్రమకు ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం. తద్వారా మన యువతకు, టెక్నీషియన్లకు, రచయితలకు, దర్శకులకు విస్తృత ఉపాధి అవకాశాలు లభిస్తాయని తాము విశ్వసిస్తున్నామని చెప్పారు.
ప్రజా గాయకుడు గద్దర్ సమాజం కోసం , కళల కోసం తన జీవితాన్ని అంకితం చేశారని స్పష్టం చేశారు మల్లు భట్టి విక్రమర్క. ఆయన స్మరణార్థం ఈ అవార్డులను ప్రారంభించి సినీ రంగాన్ని ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. కేవలం ప్రతిభ, పారదర్శకత మాత్రమే ఈ అవార్డుల ఎంపికలో ప్రధాన ప్రమాణాలుగా ఉంటాయని అన్నారు. ఈ నెల 6వ తేదీ నుండి అవార్డుల స్క్రీనింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుందని స్పష్టం చేశారు. ఉగాది పండుగ రోజైన మార్చి 19న అత్యంత వైభవంగా ‘గద్దర్ ఫిలిం అవార్డుల’ ప్రధానోత్సవ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తుందని చెప్పారు మల్లు భట్టి విక్రమార్క.
















