విజయవాడ : రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు వివేకానంద మానవ వికాస కేంద్రం. ఆరు అంతస్తుల భవనంలో ప్రతి అంతస్తును ఒక ప్రత్యేక ప్రయోజనం కోసం కేటాయించారు . మొదటి అంతస్తులో పాఠకులకు జ్ఞానాన్ని అందించే బుక్ స్టాల్, పరిపాలనా వ్యవహారాల కోసం కార్యాలయం, సందర్శకుల కోసం గెస్ట్ రూమ్ , ఆధునిక కేఫ్టీరియా ఏర్పాటు చేశారు. రెండవ అంతస్తులో భక్తుల కోసం ప్రశాంతమైన దేవాలయం, పూజా కార్యక్రమాల కోసం ప్రత్యేకంగా ఫ్రూట్ కటింగ్ రూమ్ , సౌకర్యవంతమైన వాష్‌రూమ్స్ నిర్మించారు. మూడవ అంతస్తులో విద్యార్థుల కోసం 4 విశాలమైన తరగతి గదులను సిద్ధం చేశారు. నాలుగవ అంతస్తులో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా అదనంగా 2 తరగతి గదులను ఏర్పాటు చేశారు. ఐదవ అంతస్తులో అతిథుల కోసం 2 గెస్ట్ రూమ్స్, ఒక తరగతి గది, భారీ డైనింగ్ హాల్, వంటశాల (Kitchen), మరో కేఫ్టీరియా ఉన్నాయి.
విజయవాడ రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి వినిశ్చిలానంద మహరాజ్ మీడియాతో మాట్లాడారు. .రామకృష్ణ మిషన్ విద్య, వైద్య రంగాల్లో విశిష్ట సేవలందిస్తోందని వెల్లడించారు. రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో గాంధీనగర్ లో రూ.8.5 కోట్లతో నిర్మించిన భవన నిర్మాణం ఎంతో మంది యువతీ యువకులకు మార్గ నిర్దేశం చేయనుందన్నారు. ఈ భవన నిర్మాణంలో ఏర్పాటు చేసిన పుస్తక విక్రయశాలను ఫిబ్రవరి 1న ఆదివారం మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం వసతులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ యువతకు ఈ భవనం, శిక్షణపై అవగాహన కల్పించేందుకు మీడియా కృషి చేయాలని కోరారు.



















