హైదరాబాద్ : గోల్కొండ కోట ప్రాంగణంలో చారిత్రక కటోరా హౌజ్ పరిరక్షణకు హైడ్రా పూర్తి సహకారం అందిస్తుందని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. 450 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ నీటి వనరును కాపాడేందుకు నిర్మాణ్ ఎన్‌జీవో ముందుకు రావడం సంతోషకరమైన విషయమని పేర్కొన్నారు. కేంద్ర ఆర్కియాలజీ శాఖ సంరక్షణలో ఉన్న ఈ చెరువును హైడ్రా కమిషనర్ సందర్శించారు. కటోరా హౌజ్‌కు పూర్వ వైభవం తెచ్చేందుకు సహకరించాలని కోరిన నేపథ్యంలో హైడ్రా కమిషనర్ పరిశీలించారు. ఈ నీటి వనరును కాపాడేందుకు తీసుకుంటున్న చర్యలను హైడ్రా కమిషనర్‌కు నిర్మాణ్ ఎన్‌జీవో తరఫున పనులు పర్యవేక్షిస్తున్న కల్పనా రమేష్ , ఆర్కియాలజీ విభాగం అధికారులు తెలిపారు. నీటి ట్యాంక్‌లో చెత్త వేయడానికి వీలు లేకుండా ఎత్తయిన ఫెన్సింగ్ ఏర్పాటు చేయడంతో పాటు.. చుట్టూ పాత్‌వే అభివృద్ధి చేయాలని భావిస్తున్నామన్నారు.
ఈ చారిత్రక నీటి వనరులోంచే వేసిన మురుగునీటి పైపు లైనుకు ప్రత్యామ్నాయం చూపేందుకు సహకరించాలని హైడ్రా కమిషనర్‌ను కోరారు. ఇక్కడ అభివృద్ధి పనులకు అడుగడుగునా ఆటంకాలు ఏర్పడుతున్నాయని తెలిపారు. హైడ్రా సహకారం ఉంటే కటోరా హౌజ్‌కు పూర్వ వైభవం తీసుకు రావడం సాధ్యమౌతుందన్నారు. చారిత్రక చెరువులను కాపాడడంలో హైడ్రాకు ఉన్న అనుభవం కటోరాహౌజ్ అభివృద్ధికి దోహద పడాలని అభ్యర్థించారు. జలాశయం పునరుద్ధరణకు హైడ్రా పూర్తిస్థాయిలో సహకరిస్తుందని.. అలాగే ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తామని కమిషనర్ తెలిపారు. చారిత్రక జలవనరుల సంరక్షణ అత్యంత అవసరమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. దీని అభివృద్ధికి సంబంధించి చేపట్టిన కార్యక్రమాలను నివేదించాలని నిర్మాణ్ ఎన్‌జీవో, ఆర్కియాలజీ విభాగం అధికారులను కమిషనర్ కోరారు.

















