అమరావతి : ఏపీలో పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం పనవ్ కళ్యాణ్. ప్రస్తుతం రాష్ట్రంలో 30 శాతం గ్రీనరి ఉండగా వచ్చే నాలుగేళ్లలో మరో 7 శాతం గ్రీనరీ పెంచాల్సి ఉందన్నారు .అందుకోసం 9 లక్షల హెక్టార్లలో చెట్లను నాటాలని సూచించారు. ఈ యజ్ఞంలో అన్ని శాఖలు తమ వంతు భాగస్వామ్యం పోషించాల్సి ఉందన్నారు. అందులో ఉద్యానవన శాఖ 12 శాతం మొక్కలు నాటే బాధ్యతను స్వీకరించాలని సూచించారు పవన్ కళ్యాణ్. ప్రతి మొక్కా పర్యావరణ పరిరక్షణకు ఉపయోగ పడాలని అన్నారు. వీటితో పాటు అటవీ, పర్యావరణ శాఖలు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలు, నీటిపారుదల శాఖ, పాఠశాల విద్యాశాఖ, రోడ్లు భవనాల శాఖ, పరిశ్రమల శాఖ, వ్యవసాయ శాఖ, కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉన్న రైల్వే తదితర శాఖలు తమ తమ పరిధిలో లక్ష్యాలను ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకువెళ్లాల్సి ఉందన్నారు పవన్ కళ్యాణ్.
జాతీయ రహదారులకి ఇరువైపులా మొక్కలు నాటే సంప్రదాయం ఉందన్నారు. దీన్ని రాష్ట్ర పరిధిలోని రహదారుల నిర్మాణంలోనూ అమలు చేయాలన్నారు. గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టు కూడా గ్రీన్ కవర్ పెంపునకు దోహద పడుతుందన్నారు. 970 ఎకరాల తీర ప్రాంతం వెంబడి 40 శాతం అటవీ శాఖ పరిధిలో ఉండగా, మిగిలిన భూభాగంలో ప్రాజెక్టుని ముందుకు తీసుకువెళ్లేందుకు అవసరం అయిన ప్రణాళికలు ఆయా శాఖలు సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. తీర ప్రాంతం వెంబడి ఉన్న ప్రాంతంలో అక్కడ వాతావరణ పరిస్థితులకు తట్టుకునే మొక్కలకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. పారిశ్రామిక కారిడార్లలో కాలుష్య నియంత్రణకు తోడ్పడే మొక్కలను పెంచాలని సూచించారు.

















