హైదరాబాద్ : దేశంలోనే ఘనమైన వారసత్వానికి, చరిత్రకు సాక్ష్యంగా నిలిచాయి హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలు అని అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. శనివారం ఆయన హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజా పాలన నడవడం లేదని, కేవలం తుగ్లక్ పాలన సాగుతోందని సంచలన ఆరోపణలు చేశారు. ఈ రెండు నగరాలు తెలంగాణ ప్రజల గొప్ప అస్తిత్వ చిహ్నాలు అని చెప్పారు. కానీ రేవంత్ రెడ్డి తీసుకున్న తుగ్లక్ నిర్ణయం వల్ల సికింద్రాబాద్‌కు చారిత్రక గుర్తింపు పూర్తిగా పోయేటట్లు ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. సికింద్రాబాద్‌లోని అన్ని వర్గాల ప్రజలు ఒక్కటయ్యారని, ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారని అన్నారు. ప్రజలంతా సంఘటితమై మా పార్టీని ఆహ్వానించడం జరిగిందన్నారు.
.
అక్కడ ఉన్న ప్రజా ప్రతినిధులు మొత్తం మా పార్టీకి చెందిన వారే ఉన్నారని చెప్పారు కేటీఆర్. సికింద్రాబాద్‌లో పుట్టిన బిడ్డలుగా సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కాపాడాలని ప్రజలు రెడీగా ఉన్నారని పేర్కొన్నారు. అధికారం ఇచ్చింది పట్టణాల అస్తిత్వాలను, ప్రజల అస్తిత్వాలను గుర్తు లేకుండా చెరిపి వేయడం కోసం కాదన్నారు. గ్యారెంటీలను అమలు చేయడానికి, ప్రజలకు మంచి చేయాలని పవర్ ఇచ్చారని దానిని సద్వినియోగం చేసుకోకుండా సీఎం అడ్డగోలు పనులన్నీ చేస్తున్నారని ఆరోపించారు కేటీఆర్. హైదరాబాద్ నగరంలో రెండు సంవత్సరాలుగా ఒక్క ఇటుక కూడా పెట్టలేదన్నారు. ఒక్క రోడ్డు కూడా వేయలేదు, ఒక ఇల్లు కూడా కట్టలేదు. కానీ నగరం మొత్తం తన విధ్వంస ప్రణాళికలతోనే ముందుకు పోతున్నాడని ఆరపించారు కేటీఆర్.















