తిరుపతి : తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో కనుమ పండుగ సందర్బంగా గో మహోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్, బోర్డు సభ్యులు శ్రీ జి.భాను ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు . ఇందులో భాగంగా గోశాలలోని శ్రీవేణుగోపాల స్వామి ఆలయంలో పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం గౌరి పూజ, తులసి పూజ చేశారు. అటుతర్వాత గజరాజు, అశ్వాలు, వృషభాలు, గోవులకు పూజలు చేసి కర్పూర హారతులు సమర్పించి, వాటికి దానా అందించారు. ఈ సందర్భంగా దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజనలు, కోలాటాలు నిర్వహించారు.
గోశాల ఇంచార్జి సంచాలకులు డాక్టర్ శివ కుమార్, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అనంతరం ముఖ్య కార్య నిర్వహణ అధికారి అనిల్ కుమార్ సింఘాల్ మీడియాతో మాట్లాడారు. ప్రతి ఏటా సంక్రాంతి పండుగ రోజు గోశాలలో గోవులకు పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోందని చెప్పారు. రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుట్ట బోతున్నామని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వైకుంఠ ద్వార దర్శనాలను ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామన్నారు. అంది వచ్చిన టెక్నాలజీని ఉపయోగించుకుని అందరి సహాయ సహకారాలతో సక్సెస్ చేసినట్లు తెలిపారు అనిల్ కుమార్ సింఘాల్.



















