కేరళ : కోట్లాది భక్తులను కలిగిన ఏకైక పుణ్య క్షేత్రం భారత దేశంలోని కేరళ రాష్ట్రం శబరిమల. మకర సంక్రాంతి సందర్బంగా అయ్యప్ప స్వామి భక్తులు శబరిమలకు పోటెత్తారు. ఎక్కడ చూసినా భక్తులతో నిండి పోయింది ఆ ప్రాంతమంతా. స్వామియే శరణం అయ్యప్ప అంటూ స్మరిస్తూ అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకునేందుకు బారులు తీరారు కిలోమీటర్ల పొడవునా. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి శబరిమలలో భక్తుల కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు ఆలయ కమిటీ నిర్వాహకులు. పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేశారు. ఎంతో పుణ్యం చేస్తేనే తప్పా అయ్యప్ప స్వామి దర్శన భాగ్యం కలుగదని అయ్యప్ప స్వాముల ప్రగాఢ నమ్మకం, విశ్వాసం కూడా.
అంతే కాదు ఎంతో పుణ్యం చేసుంటే.. ఎన్నో జన్మల అదృష్టం ఉంటే ఆ జ్యోతి దర్శన భాగ్యం కలుగుతుందని భావిస్తారు. ఈ అపురూప దృశ్యం కోసం గంటల కొద్దీ క్యూ లైన్‌లో వేచి ఉన్నారు. సాయంత్రం సరిగ్గా 6.45 గంటలకు అయ్యప్ప స్వామి రూపంలో మకర జ్యోతి దర్శనం ఇచ్చింది. సాక్షాత్తు ఆ అయ్యప్ప స్వామినే భక్తులకు జ్యోతి రూపంలో దర్శనం ఇస్తాడని భక్తుల విశ్వాసం. ప్రతి ఏటా మకర సంక్రాంతి పండుగ సందర్బంగా ఈ జ్యోతి రావడం ఆనాయితీగా వస్తోంది. శబరిమలకు వెళ్లిన ప్రతి ఒక్కరూ మకర జ్యోతి దర్శనాన్ని ప్రత్యక్షంగా చూడాలని ఆరాట పడుతారు. ఆ సమయంలో స్వామియే శరణమయ్యప్ప అంటూ అయ్యప్ప భక్తుల శరణుఘోషతో శబరిగిరులు మారు మోగుతుండగా సాక్షాత్తు అయ్యప్ప స్వామి మకరజ్యోతి రూపంలో దర్శనం ఇవ్వడంతో అంతా జన్మ ధన్యమైందని సంతోషం వ్యక్తం చేశారు.


















