గుంటూరు జిల్లా : మిర్చి ధరల విషయంలో గతేడాది రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో ఈసారి అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. గుంటూరులోని వ్యవసాయ మార్కెటింగ్ కార్యాలయంలో మిర్చి ధరలపై నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఈ ఏడాది మిర్చి ధరలు ఆశాజనకంగా ఉన్నాయని చెప్పారు. గతేడాది ధరలు అధికంగా ఉండటంతో రైతులు విపరీతంగా మిర్చి సాగు చేశారని, దాని ప్రభావంతో మార్కెట్లో సమస్యలు ఏర్పడ్డాయని వివరించారు. ఎంత విస్తీర్ణంలో మిర్చి సాగు చేస్తే ధరలు నిలకడగా ఉంటాయో రైతులకు అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి స్పష్టంగా సూచించారని మంత్రి తెలిపారు.
గత ఏడాది క్వింటాల్ కు రూ.11,750 మద్దతు ధర ఉందని చెప్పారు. ఈ ఏడాది 44 శాతం వరకు ఉత్పాదకత తగ్గిందన్నారు. క్రయ విక్రయాలకు అనుకూల వాతావరణం ఏర్పాటుకు సమావేశం నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. గత ఏడాది 1.96 లక్షల హెక్టార్లలో పండించడం జరిగిందని, ఈ ఏడాది 1.06 లక్షల హెక్టార్లలో పండించడం జరిగిందని వివరించారు. డిసెంబర్ నుండి జాన్ వరకు పంట మార్కెట్ కు వస్తుందని తెలిపారు. 13.88 లక్షల మెట్రిక్ టన్నుల నిలువ సామర్థ్యం ఉందన్నారు. గత ఏడాది 6.62 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పాదకత ఉండగా, ఈ ఏడాది 5.39 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పాదకత ఉందని చెప్పారు. సీజన్ లో 45 వేల నుండి 55 వేల బస్తాలు మొత్తంగా లక్ష బస్తాలు వస్తాయని తెలిపారు. తేజ రకం మినహా మిగిలిన రకాలకు ధరలు ఆశాజనకంగా ఉందన్నారు అచ్చెన్నాయుడు. మార్కెట్ ఫీజు రూ.85.37 కోట్లు వసూలైందని తెలిపారు.















