అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆరు నూరైనా సరే పోలవరం ప్రాజెక్టు పనులు అనుకున్న సమయానికి పూర్తి కావాలని ఆదేశించారు. లేకపోతే చర్యలు తప్పవంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని ఆయన ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. అనంతరం పోలవరం ప్రాజెక్టు సైట్ వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష చేపట్టారు. ఈ కీలక సమీక్షలో మంత్రులు నిమ్మల రామానాయుడు, కొలుసు పార్ధసారధి, నాదెండ్ల మనోహర్, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. జలవనరుల శాఖ ఉన్నతాధికారులు, ఇంజనీర్లు హాజరయ్యారు. ప్రాజెక్టులో 87 శాతం మేర సివిల్ పనులు పూర్తి అయ్యాయని చెప్పారు. అయితే నిర్దేశించిన గడువులోగా మిగతా పనులు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు.
ప్రాజెక్టు నిర్వాసితుల పునరావాసం, ఆర్ అండ్ ఆర్ పనులపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాలని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పునరావాసం, ఆర్ అండ్ ఆర్ పనులపై యాక్షన్ ప్లాన్ రూపొందించుకుని పని చేయాలని సూచించారు. పోలవరం ఎడమ కాలువ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని పేర్కొన్నారు. లేక పోతే చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. కుడికాలువ ద్వారా కొల్లేరు ప్రాంతాలకు కూడా నీరు వెళ్లేలా ప్రణాళికలు చేయాలని సూచించారు నారా చంద్రబాబు నాయుడు. కాగా మే మొదటి వారంలో మళ్లీ పోలవరం ప్రాజెక్టు పనుల్ని తనిఖీ చేస్తానని సీఎం వెల్లడించారు.















