న్యూఢిల్లీ : వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు, మాజీ టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభలో ఎన్నికల సంస్కరణలపై జరిగిన చర్చలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఎన్నికల నిర్వహణ లోప భూయిష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తాము దేశంలో ఎక్కడా లేని విధంగా జగన్ రెడ్డి హయాంలో ఏపీలో అనేక సంక్షేమ కార్యక్రమాలను, పథకాలను అమలు చేయడం జరిగిందన్నారు. తాము చేపట్టిన సర్వేలలో అంతా తమకు అనుకూలంగా వచ్చినప్పటికీ చివరకు ఏదో మాయజాలం తమను వెనక్కి నెట్టి వేసేలా చేసిందన్నారు. 150కి పైగా సీట్లు గెలుపొందిన తమను 11 సీట్లకే పరిమితం చేయడం పట్ల అనుమానం వ్యక్తం చేశారు వైవీ సుబ్బారెడ్డి. దీని వెనుక ఏదో కుట్ర దాగి ఉందని ఆరోపించారు .
అందుకే తమకు ఈవీఎంలను నమ్మకం లేకుండా పోయిందంటూ చెప్పారు. ఈవీఎంల కంటే పేపర్ బ్యాలెట్‌పైనే అందరికీ నమ్మకం ఉందని అన్నారు.. సీసీటీవీ ఫుటేజ్ అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు రాజ్యసభ ఎంపీ. ఏపీలో జరిగిన ఎన్నికల అక్రమాలపై ఎన్నికల సంఘం తక్షణమేవిచారణ జరపాలని వైవీ సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. ఈ అక్రమాలకు బాధ్యులెవరో తేల్చాల్సిన అవసరం ఉందని అన్నారు. ఏపీలో జరిగిన ఎన్నికల్లో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల ఓట్లలో అనేక తేడాలు వచ్చాయని అందుకే తాము విచారణ చేపట్టాలని కోరుతున్నామన్నారు వైవీ సుబ్బారెడ్డి.
















