KTR : హైదరాబాద్ : బీసీ రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ సర్కార్ డ్రామాలు ఆడుతోందని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR). తెలంగాణ బీసీలకు కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ చేసిన అన్యాయాన్ని ఢిల్లీలో ఎండగతాం అన్నారు. ఎలాంటి రిజర్వేషన్ల పెంపు జరగక ముందే 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు తెలంగాణలో ఇచ్చినట్లు దేశ వ్యాప్తంగా చెప్పుకుంటూ తిరుగుతున్న రాహుల్ గాంధీ చేస్తున్న మోసాన్ని దేశ ప్రజల ముందు ఉంచుతామని ప్రకటించారు. తనకు చిత్తశుద్ధి ఉంటే లోక్‌సభలో అపోజిషన్ లీడర్‌గా ఉన్న ఆయన వెంటనే ఈ అంశం పైన పార్లమెంటులో చర్చకు వచ్చేలా చూడాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై రానున్న పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ నుంచి ఎన్నికై ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు లోక్‌సభలో గళం విప్పాలన్నారు కేటీఆర్.
KTR Slams Congress Govt
బీసీ డిక్లరేషన్ పేరుతో ఇచ్చిన హామీలన్నింటినీ తుంగలో తొక్కి, అడుగడుగునా బీసీలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని ఎక్కడికక్కడ నిలదీస్తాం అన్నారు. వచ్చే బడ్జెట్‌లో 20 వేల కోట్ల రూపాయల నిధులను కేటాయించేలా కాంగ్రెస్ పార్టీపై ఒత్తిడి తీసుకువస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో బీసీ ప్రజా ప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నేతలతో జరిగిన సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. బీసీ రిజర్వేషన్ల అంశంతో పాటు బీసీలకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ద్రోహం పైన ఆ పార్టీ తీరును ఎండగడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. కేంద్రంలోని బీజేపీ సహకరించకుంటే రాహుల్ గాంధీ ఎందుకు ఈ అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తరు అని ప్రశ్నించారు. తనకు నిజంగానే బీసీల పైన, 42 శాతం రిజర్వేషన్ల అంశం పైన చిత్తశుద్ధి ఉంటే ప్రైవేట్ మెంబర్ బిల్లు సైతం ప్రవేశ పెట్టవచ్చు కదా అని కేటీఆర్ ప్రశ్నించారు.
Also Read : DY CM Bhatti Vikramarka Huge Funds Released : మూడున్నర లక్షల మహిళా సంఘాలకు రూ. 304 కోట్లు

















