K Kavitha : నల్లగొండ జిల్లా : రాష్ట్ర ప్రభుత్వం భూములు కోల్పోయిన నిర్వాసితుల పట్ల కనికరం చూపడం లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (K Kavitha). తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జనం బాటకు శ్రీకారం చుట్టారు. మొదట నిజామాబాద్ జిల్లాలో ప్రారంభమైన ఈ యాత్ర వివిధ జిల్లాల ద్వారా కొనసాగుతోంది దిగ్విజయంగా. తాజాగా ఆమె డిండి ఎత్తిపోతల పథకం కింద నిర్వాసితులను కలిసి పరామర్శించారు. వారి బాధలను విన్నారు. వారి సమస్య పరిష్కారం అయ్యేంత వరకు తాను పోరాడుతూనే ఉంటానని వారికి భరోసా ఇచ్చారు. ఈ సందర్బంగా కవిత మీడియాతో మాట్లాడారు. ఒకప్పుడు నాగరికతలు నీటి దగ్గరే వర్ధిల్లాయని, కానీ నేడు అదే జలాలు డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా నిర్వాసితులైన కుటుంబాలకు శాపంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు.
K Kavitha Demands
వారు ఆశతో తమ భూములను ఇచ్చారని, అయినప్పటికీ 11 సంవత్సరాలు గడిచినా, వారికి ఇళ్ళు లేదా న్యాయమైన పరిహారం లేకుండా మిగిలి పోవడం బాధాకరమన్నారు. గతంలో ఏలిన వారు, ఇప్పుడు నమ్మించి అధికారంలోకి వచ్చిన వారు ఎవరూ వీరి గోస గురించి పట్టించుకోక పోవడం దారుణమన్నారు. అప్పట్లో మైనర్లుగా ఉన్న చాలా మంది ఇప్పుడు పెద్దలుగా మారి పోయారని, కానీ ఇప్పటికీ న్యాయం కోసం ఎదురు చూస్తూనే ఉన్నారన్నారు. తన జనం బాట యాత్రలో తాను తెలంగాణ అంతటా ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్న నిర్వాసితులను చూస్తూనే వస్తున్నానని చెప్పారు. అభివృద్ధి కోసం త్యాగం చేసిన ప్రజలను మరిచి పోతే ఎలా అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. తక్షణమే డిండి నిర్వాసితులను ఆదుకోవాలని కవిత డిమాండ్ చేశారు.
Also Read : Konda Surekha Sorry to Nagarjuna Sensational : స్పందించిన కొండా సురేఖా సారీ నాగార్జునా
















