హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డిపై సీరియస్ అయ్యారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. ఇష్టానుసారం మాట్లాడటం మంచి పద్దతి కాదన్నారు. జనం ఏవగించు కుంటున్నారని, ఆ విషయం తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు. తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎవరు గోబెల్స్, ఎవరు నియంతలో ప్రజలకు తెలుసు అని అన్నారు. ఏవైనా పొరపాట్లు ఉంటే ఎత్తి చూపవచ్చు కానీ నిత్యం నిందాపూర్వక ఆరోపణలు చేయడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు నిరంజన్ రెడ్డి. ఏం చేస్తారో చెప్పకుండా ఇప్పుడు కూడా కేసీఆర్ మీద, తండ్రి చని పోయి బాధలో ఉన్న మాజీ మంత్రి హరీష్ రావుపై నోరు పారేసు కోవడం దారుణమన్నారు. 14 ఏండ్లు ఒక ప్రత్యేకమైన పద్దతిలో ప్రపంచ ఉద్యమాలకు కొత్త నిర్వచనం ఇచ్చేలా కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ కోసం పోరాడామన్నారు.
60 ఏండ్ల తెలంగాణ కలను సాకారం చేయడం కోసం తెలంగాణ ప్రజల మీద జరిగిన దాడి, వివక్ష, అవమానాలను ప్రజలకు వివరించి తెలంగాణ సబ్బండ వర్గాలను ఏకంచేసి తెలంగాణను సాధించిన కేసీఆర్ గురించి అడ్డగోలుగా మాట్లాడడం భావ్యం కాదన్నారు. ఇది రేవంత్ రెడ్డికి తగదన్నారు. గత 10 ఏండ్లు తెలంగాణ పునర్నిర్మాణంలో కేసీఆర్ అద్భుతంగా పని చేశారని, దానికి ఎవరి సర్టిఫికెట్లు అవసరం లేదన్నారు. తెలంగాణ సమాజం, చరిత్ర గుర్తించిందన్నారు. ఇక సీఎం తన పరిమిత జ్ఞానంతో ఎలా పడితే అలా మాట్లాడుతూ తన స్థాయిని తగ్గించు కుంటున్నాడని మండిపడ్డారు.
















