TTD : బ్రహ్మాండ పురాణం కలియుగ వైకుంఠంగా కీర్తించిన శేషాచలం పర్వత శ్రేణి ఆధ్యాత్మిక కాంతితో పాటు చారిత్రక, పురావస్తు ప్రాధాన్యతను సైతం కలిగి ఉంది. కోట్ల ఏళ్ల నాటి సహజ శిలాతోరణాల నుంచి ఆదిమ మానవుల వాసస్థలాల దాకా, పల్లవులు–విజయనగర రాజుల నిర్మాణాల నుంచి శిథిలమైన మండపాల దాకా అనేక అవశేషాలు ఈ ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి.
TTD – సహజ శిలాతోరణం – అరుదైన అద్భుతం
తిరుమలకు (TTD) ఉత్తరం వైపు చక్రతీర్థ సమీపంలోని సహజ శిలాతోరణం ప్రపంచంలో అరుదైన భౌగోళిక విశేషం. సుమారు 250 కోట్ల ఏళ్ల కిందట క్వార్ట్జ్ రాళ్లతో ఏర్పడిన ఈ శిలాతోరణం 25 అడుగుల వెడల్పు, పొడవుతో, 10 అడుగుల ఎత్తుతో కనిపిస్తుంది. దీన్ని భారత ప్రభుత్వం జాతీయ స్మారక చిహ్నంగా గుర్తించింది.
యుద్ధగళ తీర్థం – ఆదిమ మానవుల జాడలు
తలకోన కొండల దాటితే చేరగల యుద్ధగళ తీర్థం వద్ద రాతిబండలపై ఆదిమ మానవులు చెక్కిన చిత్రాలు ఉన్నాయి. క్రీస్తు పూర్వం 500 నుంచి క్రీస్తు శకం 600 మధ్యకాలానికి చెందినవిగా ఇవి భావిస్తున్నారు.
పితృగళ తీర్థం – ప్రాచీన చిత్రలేఖనం
అన్నమయ్య జిల్లాలోని మాధవరంపట్నం అటవీ మార్గంలో పితృగళ తీర్థం ఉంది. ఇక్కడ రాతిబండలపై చెక్కిన మానవ ఆకృతులు ప్రాచీన చరిత్ర యుగపు మానవుల జాడలను తెలియజేస్తున్నాయి.
ఈతకాయల మండపం
తూర్పున కుక్కలదొడ్డి నుంచి తిరుమలకు (TTD) చేరే దారిలో ఈతకాయల మండపం కనిపిస్తుంది. శ్రీవారి భక్తులు శతాబ్దాలుగా విశ్రాంతి తీసుకోవడానికి దీన్ని ఉపయోగించుకున్నారు.
శిథిల సత్రాలు
పార్వేట మండపం దాటి ఐదు కిలోమీటర్ల దూరంలో శిథిలమైన మండపాలు, కోనేరు కనబడతాయి. ఇవి భక్తుల విశ్రాంతి, వంట, తాగునీటి అవసరాల కోసం ఉపయోగించబడ్డాయని భావిస్తున్నారు.
రాతి యుగపు సమాధులు
చంద్రగిరి సమీపంలోని మల్లయ్యపల్లి వద్ద రాతి యుగపు సమాధులు ఉన్నాయి. వరుసగా పేర్చిన రాళ్లపై భారీ రాతిబండలతో నిర్మించిన ఈ సమాధులను పాండవ గుళ్ళు, డాల్మన్లు అంటారు. వీటిపై మానవులు, జంతువులు, ఆయుధాల చిత్రాలు చెక్కబడి ఉన్నాయి.
ఘంటా మండపం – రాజసాంప్రదాయం
తిరుమల శ్రీవారి మెట్లు ఎక్కిన శిఖర అంచున గంభీరంగా నిలిచిన ఘంటా మండపం విజయనగర, యాదవ రాజుల పాలనను గుర్తు చేస్తుంది. ఆలయంలో నైవేద్యం పూర్తయ్యాక మాత్రమే రాజులు భోజనం చేసేవారు. ఈ సమాచారం అందించేందుకు పెద్ద గంటను ఇక్కడ ఏర్పాటు చేశారు.
Also Read : PM Modi Important Update on GST : జీఎస్టీ రాయితీలతో దేశానికి నూతన ఆరంభం: ప్రధాని మోదీ



















