YS Sharmila : అమరావతి : ఏపీలో అసలు వైద్య, ఆరోగ్య శాఖ ఉందా అన్న అనుమానం కలుగుతోందన్నారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి. కూటమి ప్రభుత్వ వైఫల్యానికి తురుకపాలెం మరణ మృదంగమే నిదర్శనం అన్నారు. గత 5 నెలలుగా వరుస మరణాలు సంభవిస్తుంటే వైద్యారోగ్య శాఖ ఏం చేస్తోందంటూ ప్రశ్నించారు. అసలు మంత్రి సత్య కుమార్ యాదవ్ నిద్ర పోతున్నారా అంటూ మండిపడ్డారు. ఇకనైనా సర్కార్ మేల్కోవాలని , వెంటనే గ్రామస్థులను భయాందోళనల నుంచి రక్షించాలని కోరారు. శుక్రవారం షర్మిలా రెడ్డి (YS Sharmila) మీడియాతో మాట్లాడారు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కూటమి సర్కార్ అనుసరిస్తున్న నిర్లక్ష్యంపై. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు.
YS Sharmila Slams AP Health Department
ఇప్పటికే పాలన పడకేసిందని, ఇక ఉన్నది కాస్తా ఊడిపోయేలా ఉందన్నారు. సంబంధిత శాఖ మంత్రి ఏం చేస్తున్నారంటూ నిలదీశారు ఏపీపీసీసీ చీఫ్. ఇప్పటిదాకా 35 మంది ఒకేవిధంగా మృత్యువాత పడితే కారణం కనుక్కొని అరికట్టక పోవడం సిగ్గుచేటు అంటూ ధ్వజమెత్తారు. అంతుచిక్కని వ్యాధి ఇంకా ఎంత మందిని బలి గోరుతుందోనని గ్రామస్థులు హడలి పోతున్నా ఇప్పటి వరకు మంత్రి కానీ, ప్రభుత్వం కానీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం, స్పందించక పోవడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. ప్రజలు ప్రాణ భయంతో విలవిల్లాడుతుంటే మహమ్మారిని అదుపు చేయక పోవడం దారుణమన్నారు
కూటమి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామని, తురుకపాలెం మృత్యుఘోషపై వెంటనే స్పందించాలన్నారు. వైద్యారోగ్య శాఖ పరంగా తక్షణం ఉన్నతస్థాయి కమిటీ వేయాలని కోరారు షర్మిలా రెడ్డి. గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి అన్ని రకాల మెడికల్ టెస్టులు నిర్వహించాలని అన్నారు. పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు. మరణాలకు కల్తీ నీళ్లు కారణమా ? కల్తీ లిక్కర్ తో సంభవిస్తున్న మరణాలా అన్నది తేల్చాలన్నారు. లేక గ్రామంలో పారిశుద్ధ్య లోపమా ? ఇంకేమైనా కారణం ఉందా అన్నది బయట పడాలన్నారు. వెంటనే తేల్చి నివారణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
Also Read : Minister Nara Lokesh Important Meeting : పెట్టుబడుల సాధనకు సహకారం అందించండి

















