Indian Railways : దేశంలో ప్రధాన రైల్వే స్టేషన్లలో ఒకటైన న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు భారతీయ రైల్వే (Indian Railways) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు చెల్లుబాటు అయ్యే టిక్కెట్లు ఉన్న ప్రయాణికులకే స్టేషన్‌లోకి ప్రవేశాన్ని అనుమతించే విధంగా ఒక నెల పాటు ప్రయోగాత్మకంగా ఈ విధానం అమలు చేయనుంది.
ఈ చర్య ఈ ఏడాది ఫిబ్రవరిలో న్యూఢిల్లీలో చోటుచేసుకున్న ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకొని, భవిష్యత్తులో అలాంటి పరిస్థితులు రాకుండా చూడడానికీ, ప్రయాణికుల సౌకర్యాలను మెరుగుపరచడానికీ తీసుకుంటున్నట్లు ఉత్తర రైల్వే ముఖ్య ప్రజాసంబంధ అధికారి హిమాన్షు శేఖర్ వెల్లడించారు. ప్రయోగం విజయవంతమైతే, దేశంలోని ఇతర రద్దీగల స్టేషన్లకు విస్తరించే అవకాశం ఉందని సమాచారం.
Indian Railways – రిజర్వేషన్ లేని టిక్కెట్లపై పరిమితి విధింపు
గతంలో రైల్వే బోర్డు (Indian Railways) ప్రతి అన్‌రిజర్వ్డ్ కోచ్‌కు 150 టిక్కెట్లు మాత్రమే జారీ చేసే విధానంను పరీక్షించింది. ఈ ప్రణాళికకు అనుగుణంగా టిక్కెట్లు జారీకి సాఫ్ట్‌వేర్ పరిమితి విధించబడుతుంది. నిర్ణీత గరిష్ఠ సంఖ్య చేరిన వెంటనే టిక్కెట్లు జారీని నిలిపివేస్తారు. ఇప్పటి వరకు అన్‌రిజర్వ్డ్ టిక్కెట్ల జారీపై ఎలాంటి పరిమితి లేకపోవడంతో, ఒక కోచ్‌కు 80 మంది కేటాయింపు ఉన్నప్పటికీ, పండుగల సమయంలో 300 నుంచి 400 మంది వరకు ప్రయాణించే పరిస్థితులు ఏర్పడతున్నాయని అధికారులు చెబుతున్నారు.
కొత్త విధానం ఎలా పనిచేస్తుంది?
కొత్త విధానం ప్రకారం:
- ప్రారంభ స్టేషన్ నుండి ప్రతి అన్‌రిజర్వ్డ్ కోచ్‌కు 150 టిక్కెట్లు మాత్రమే జారీ చేయబడతాయి.
- ఇంటర్మీడియట్ స్టేషన్లకు 20% అదనపు టిక్కెట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి.
- ఉదాహరణకు, రైలులో 4 అన్‌రిజర్వ్డ్ కోచ్‌లు ఉంటే, ప్రారంభ స్టేషన్ నుంచి గరిష్ఠంగా 600 టిక్కెట్లు మాత్రమే జారీ అవుతాయి.
మూడు గంటల లోపు ప్రయాణించే రైళ్లకు మొదట అమలు
ఈ విధానం ప్రాథమికంగా మూడుగంటల లోపు ప్రయాణించే రైళ్లకు మాత్రమే వర్తించనుంది. దీని ద్వారా ప్రయాణికులకు సీట్లు దొరికే అవకాశం మెరుగవడమే కాక, ప్రయాణం సురక్షితంగా, సౌకర్యవంతంగా మారనుంది. ప్రయోగం సఫలమైతే, దేశవ్యాప్తంగా అనేక రైల్వే స్టేషన్లలో ఈ విధానాన్ని అమలు చేసే దిశగా రైల్వే శాఖ యోచనలో ఉంది.
ప్రయాణికులకు ఊరట
రైల్వే తీసుకుంటున్న ఈ చర్యలతో, ముఖ్యంగా పండుగలు, సెలవు కాలాల్లో ప్రయాణించే వారికి గందరగోళ పరిస్థితులు తగ్గి, ప్రయాణం మరింత ప్రశాంతంగా మారనుంది. రైల్వే ఈ ప్రణాళికను ప్రయాణికుల భద్రత, సౌకర్యం దృష్ట్యా ఒక అభినవ ప్రయత్నంగా అభివర్ణిస్తున్నారు.
Also Read : Airtel Shocking : తమ కస్టమర్లకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన ‘ఎయిర్‌టెల్’















