6 నుండి శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ వారి బ్ర‌హ్మోత్స‌వాలు

శ్రీ పాంచరాత్ర ఆగమానుసారం నవాహ్నిక వైభవం

hellotelugu-SriPadmavathiBrahmotsavam

తిరుప‌తి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మ వారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు డిసెంబర్ 06 నుండి 14వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగనున్నాయి. ప్రతి ఏటా తొమ్మిది రోజుల పాటు శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారం ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వ‌స్తోంది. డిసెంబ‌ర్ 1న బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఆలయ శుద్ధి కోసం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వ‌హిస్తారు. 5న ఉదయం లక్ష కుంకుమార్చన, సాయంత్రం అంకురార్పణ జ‌రుగుతుంది. బ్రహ్మోత్సవాల్లో ఉదయం 8 నుండి 10 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహన సేవలు జరుగుతాయి. 6వ తేదీన ఆదివారం ఉద‌యం ధ్వజారోహణం , రాత్రి చిన్నశేష వాహనం, 7న సోమ‌వారం ఉద‌యం పెద్ద శేష వాహ‌నం, రాత్రి హంస వాహ‌నం పై అమ్మ వారు భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ఇస్తారు.

డిసెంబ‌ర్ 8వ తేదీన మంగ‌ళ‌వారం ఉద‌యం ముత్యపు పందిరి వాహనం , రాత్రి సింహ వాహనం, 9వ తేదీన బుధ‌వారం ఉద‌యం కల్పవృక్ష వాహనం, రాత్రి హనుమంత వాహనం, 10న గురువారం ఉద‌యం ప‌ల్ల‌కీ ఉత్స‌వం, రాత్రి జ‌గ వాహ‌నంపై శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ వారు ద‌ర్శ‌నం ఇస్తారు భ‌క్తుల‌కు. 11న శుక్ర‌వారం ఉద‌యం సర్వభూపాల వాహనం , స్వర్ణరథం రాత్రి గరుడ వాహనం, 12న శ‌నివారం ఉద‌య సూర్య ప్ర‌భ‌, రాత్రి చంద్ర‌ప్ర‌భ వాహ‌నం, 13న ఆదివారం ఉద‌యం ర‌థోత్స‌వం, రాత్రి అశ్వ వాహ‌నం, 14న సోమ‌వారం ఉద‌యం పంచ‌మీ తీర్థం, రాత్రి ధ్వ‌జారోహ‌ణం, 15న మంగ‌ళ‌వారం పుష్ప యాగం చేప‌ట్ట‌నున్న‌ట్లు టీటీడీ తెలిపింది.

తిరుచానూరు ఆలయ స్థల పురాణం ప్రకారం, శ్రీ పద్మావతి అమ్మవారు పద్మసరోవర పుష్కరిణిలో బంగారు పద్మం నుండి ఆవిర్భవించినట్లు ప్రతీతి. అందుకే ఈ ప్రదేశానికి పద్మావతిపురం అనే పేరు వచ్చింది. కాలక్రమేణా అదే తిరుచానూరుగా మారింది. ఈ పవిత్ర పుష్కరిణి అమ్మవారి ఆలయం వెనుక భాగంలో ఉంది. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు 12 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత, కార్తీక మాస శుక్లపక్ష పంచమి తిథి, ఉత్తరాషాఢ నక్షత్రం, శుక్రవారం నాడు అభిజిత్ లగ్నంలో, బంగారు వర్ణంతో అమ్మవారు బంగారు పద్మం నుండి ఉద్భవించారు. ఆ పవిత్ర దినానికి తొమ్మిది రోజుల ముందు నుంచే శ్రీ పాంచరాత్ర ఆగమానుసారం బ్రహ్మోత్సవాలు నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది.

బ్రహ్మోత్సవాల చివరి రోజైన పంచమీ తీర్థం నాడు పద్మసరోవరంలో చక్రస్నానం జరుగుతుంది. ఈ పుష్కరిణిలో స్నానం ఆచరిస్తే సప్త సముద్రాలు, ముక్కోటి తీర్థాల్లో స్నానమాచరించిన పుణ్యఫలం కలుగుతుందని భక్తుల విశ్వాసం. అందుకే భక్తులు కుటుంబ సమేతంగా విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని, చక్రస్నాన సమయంలో పుష్కరిణిలో స్నానమాచరించి పునీతులవుతారు. ఇదిలా ఉండ‌గా బ్రహ్మోత్సవాల నేపథ్యంలో అన్ని ఆర్జిత సేవలు, కుంకుమార్చన, వేదాశీర్వచనం, బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన‌ట్లు ప్ర‌క‌టించింది.

Exit mobile version