అమరావతి : ఏపీ కూటమి సర్కార్ వ్యవసాయ రంగంపై అధిక దృష్టిని సారిస్తోంది. ఇందులో భాగంగా రైతులకు మేలు చేకూర్చేలా చర్యలు చేపడుతోంది. వాతావరణ సమాచారం, పంట సలహాలు, చీడపీడల హెచ్చరికలు, నేల ఆరోగ్య స్థితి, ప్రభుత్వ పథకాలు, మార్కెట్ ధరలు, వ్యవసాయ భూమల వివరాలు వంటి సేవలు పంట కాలం మొత్తం రైతులకు సహాయ పడుతోంది రైతు యాప్ ద్వారా. ఇప్పటి వరకు 4.80 లక్షల మంది రైతులు ఈ యాప్ లో నమోదు చేసుకొని, సేవలు వినియోగిస్తున్నారని ప్రకటించారు శాసన సభ సాక్షిగా మంత్రి అచ్చెన్నాయుడు. తెదేపా హయాంలో 2015-16 నుండి 2018-19 వరకు రైతులకు 134 లక్షల సాయిల్ హెల్త్ కార్డ్‌లు (SHCs) పంపిణీ చేయబడ్డాయని తెలిపారు. YCP హయాంలో 2019-20 నుండి 2023-24 వరకు కేవలం 4.98 లక్షల సాయిల్ హెల్త్ కార్డ్‌లు (SHCs) మాత్రమే పంపిణీ చేశారంటూ ఆరోపించారు.
రైతులకు ఇంతటి ముఖ్యమైన కార్యక్రమాన్నిగత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసి రాష్ట్ర రైతాంగానికి తీవ్ర నష్టం కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. మరలా కూటమి ప్రభుత్వంలో భూసార పరిక్షలకు అధిక ప్రాధాన్యతనిస్తూ 2024-25 లో రూ.13.5 కోట్ల సబ్సిడీ మొత్తంతో 4.50 లక్షల సాయిల్ హెల్త్ కార్డ్‌లు(S H C లు) రూపొందించినట్లు తెలిపారు అచ్చెన్నాయుడు. 2025-26లో, 6 లక్షల SHCలు రూపొందించారని తెలిపారు. అలాగే SHC డేటా ఆధారంగా లోపాలను సరిదిద్దడానికి జింక్ సల్ఫేట్ , బోరాన్ వంటి సూక్ష్మపోషకాలను (Micronutrients) 1250 MTల మేర 100% సబ్సిడీపై పంపిణీ చేశారని చెప్పారు, దీనికి సబ్సిడీ మొత్తం రూ.37 కోట్లు సాయిల్ హెల్త్ అండ్ ఫెర్టిలిటీ స్కీమ్ (నేల ఆరోగ్య , సంతానోత్పత్తి పథకం) కింద ఖర్చు చేశామన్నారు. పొలం పిలుస్తోంది కార్యక్రమం ద్వారా 19.97 లక్షల మంది రైతులకు విస్తరణ సేవలు అందించాం అన్నారు.
