హైదరాబాద్ : కబ్జాదారులకు అడ్డు అదుపు లేకుండా పోయింది. చెరువులే కాదు.. ఊట బావులను కూడా వదలడం లేదు. గతంలో వందలు, వేలాది మందికి తాగునీరు అందించిన ఓపెన్ బావులను నేటి ప్రభుద్ధులు పూడ్చేసి ప్లాట్లుగా చేసి విక్రయించేస్తున్నారు. నగరంలో ఇలా అనేక ఓపెన్ బావులు కనుమరుగవ్వగా.. తాజాగా అల్వాల్‌లో సజీవంగా ఉన్న దానిపై కబ్జారాయుళ్ల కన్ను పడింది. 200 ఏళ్ల ఓపెన్ బావిని కాపాడి.. చారిత్రక ఆనవాళ్లను పరిరక్షించాలంటూ వెన్‌రాక్ ఎన్‌క్లేవ్ నివాసితులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. పార్కులు, రహదారులు ఇలా అనేకం ఆక్రమణలై శాశ్వత భవనాలు వచ్చేయగా.. హైడ్రా వచ్చిన తర్వాత చాలా పార్కులకు ప్రాణం పోసారంటూ పలువురు అభినందిస్తున్నారు.
తమ పార్కులను కూడా కాపాడి ప్రాణవాయువు అందించాలని వినతిపత్రాలు అందజేస్తున్నారు. తాజాగా హైడ్రా నిర్వహించిన ప్రజావాణికి 32 ఫిర్యాదులు అందాయి. వీటిని హైడ్రా అడిషనల్ కమిషనర్ ఆర్. సుదర్శన్ పరిశీలించి.. సంబంధిత అధికారులకు పరిష్కార బాధ్యతలు అప్పగించారు. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా అల్వాల్ లోని వెన్‌రాగ్ ఎన్‌క్లేవ్‌లో చారిత్రక ఊట బావిని కొంతమంది కబ్జా చేయడానికి ప్రయతిస్తున్నారని అక్కడి నివాసితులు వాపోయారు. 200 ఏళ్ల చరిత్ర ఉన్న చింతబాయి ఓపెన్ బావి ఎంతో మందికి దాహార్తిని తీర్చిందని తెలిపారు. కబ్జా నుండి దానిని కాపాడాలని కోరారు. వెన్‌రాగ్ ఎన్‌క్లేవ్ లే ఔట్ వేసినప్పుడు ఓపెన్ స్పేస్‌గా చూపించారని పేర్కొన్నారు. ఇప్పుడదే కబ్జా అవుతోందని దానిని కాపాడాలని వనతిపత్రం అందజేశారు.















