అమరావతి : ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో 175 ఎం.ఎస్.ఎంఈ పార్కులు ఏర్పాటుచేస్తున్నట్లు ఈ సందర్బంగా వెల్లడించారు పరిశ్రమల శాఖ మంత్రి టి.జి. భరత్ . ఇంటింటికీ ఒక పారిశ్రామివేత్తను తయారు చేయాలన్న లక్ష్యంతో తాము పని చేస్తున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వం ఏర్పడిన సమయంలో రాష్ట్రంలో 16 వేల ఫ్యాక్టరీలు ఉంటే ఏడాదికేడాది అవి తగ్గిపోతూ వచ్చాయన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 20 లక్షల ఉద్యోగాల హామీ అనేది తమకు కేవలం రాజకీయ నినాదం కాదని, ఐదేళ్లలో సాధించి తీరాల్సిన ఒక చారిత్రక బాధ్యతని మంత్రి స్పష్టం చేశారు. అందుకే భారతదేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా కేవలం ఉద్యోగాల కల్పన, నిరంతర పర్యవేక్షణ కోసమే ఒక ప్రత్యేక మంత్రివర్గ ఉప సంఘం రాత్రింబవళ్లు పనిచేస్తోందన్నారు. వైజాగ్ గూగుల్ AI డేటా సెంటర్, అమరావతి క్వాంటం వ్యాలీ మరియు ఎలక్ట్రానిక్స్ హబ్‌ల వంటి మెగా ప్రాజెక్టులన్నీ శరవేగంగా గ్రౌండ్ అవుతున్నాయని పేర్కొన్నారు.
దీనివల్ల అనుకున్న ఐదేళ్ల కాలంలో 20 లక్షల కంటే ఎక్కువే ఉద్యోగ అవకాశాలు లభించడం ఖాయమన్నారు మంత్రి. కొత్త పరిశ్రమలు తేవడంతో పాటు, ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న పరిశ్రమల సమస్యలను నిరంతరం సమీక్షిస్తూ, సెంట్రల్ లెవెల్ క్లియరెన్సులు సైతం రాష్ట్ర ప్రభుత్వమే సార్ట్ అవుట్ చేస్తూ పారిశ్రామికవేత్తలకు పూర్తి కాన్ఫిడెన్స్ ఇస్తున్నామని తెలిపారు. త్వరలో ప్రత్యేక ‘ఏపీ టాయ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ’, రాష్ట్రాన్ని ఫర్నిచర్ హబ్‌గా మార్చే ‘ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ పెద్ద ఇండస్ట్రియల్ పార్కులలో పనిచేసే కార్మికులు, ఉద్యోగుల వసతి కొరకు అత్యాధునిక మౌలిక వసతులతో కూడిన ‘ఇండస్ట్రియల్ హౌసింగ్ పాలసీ’ లు అమలులోకి రానున్నాయని మంత్రి ప్రకటించారు.



















