హైదరాబాద్ : రాజ్యసభ ఎంపీల ఖరారుపై కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు రాజ్యసభ రేసులో 16 మంది ఉన్నారని అన్నారు. రాజ్యసభ సభ్యుల ఎంపిక కోసం ఢిల్లీ పిలుస్తామని చెప్పారని తెలిపారు. ఢిల్లీకి పిలుస్తారా లేక ఫోన్లో చర్చిస్తామా అనేది ఇవాళ సాయంత్రం నిర్ణయిస్తాం అని అన్నారు. రాజ్యసభ సభ్యుల గురించి నిన్న 30 నిమిషాల చర్చ జరిగిందని చెప్పారు . సామాజిక వర్గాల వారిగా 16 మంది పేర్లను ఇచ్చామన్నారు. సమర్ధవంతమైన బీసీలు నలుగురు రాజ్యసభ అవకాశం ఇవ్వమని అడుగుతున్నారని పేర్కొన్నారు మహేష్ కుమార్ గౌడ్.
రాష్ట్రం నుండి ఒకరికి ఇస్తారా? లేదా ఇద్దరికి ఇస్తారా? అనేది రేపు తెలుస్తుందన్నారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి రాజ్యసభ స్థానాన్ని అడగడం లేదన్నారు. కార్పొరేట్ శక్తులకు బీఆర్ఎస్ రాజ్యసభ అవకాశం ఇచ్చిందని ఆరోపించారు. తెలంగాణ కోసం పని చేసిన వాళ్ళలో ఒక్కరికైనా బీఆర్ఎస్ రాజ్యసభ అవకాశం ఇచ్చిందా అని మండిపడ్డారు. మార్చి నెలలో కొన్ని కార్పొరేషన్ పదవులు ఇస్తామన్నారు. ఈ పదవులపై కసరత్తు జరుగుతోందని చెప్పారు. పినరయి విజయ్ వ్యాఖ్యలపై మంత్రి పొంగులేటి సమాధానం చెప్పారన్నారు. రాజకీయాల కోసమే తను అలా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.
కేరళలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు మహేష్ కుమార్ గౌడ్.
నమ్ముకున్న సిద్ధాంతం కోసం మావోయిస్టులు దశాబ్దాలుగా పని చేశారని అన్నారు. ఆపరేషన్ కగార్ ను మేం వ్యతిరేకించాం అని తెలిపారు. పాకిస్థాన్ తో చర్చలకు ఒప్పుకున్న మోదీ మావోయిస్టులతో చర్చలకు ఒప్పుకోలేదన్నారు. ప్రజల కోసం పోరాడిన వాళ్లపై గౌరవం ఉంటుందన్నారు.మేమయినా, మావోయిస్టులు అయినా పేద ప్రజల కోసమే పోరాటం చేశామన్నారు.
