దావోస్ : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా దిగ్గజ కంపెనీలతో సమావేశం అయ్యారు. మరో వైపు ఆర్సెలర్ మిట్టల్ ఫిబ్రవరిలో స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభిస్తుందని ప్రకటించారు. ఇది ఏపీకి శుభ సూచకమని పేర్కొన్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని యూఏఈ సంస్థలను ఆహ్వానించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా స్పీడ్ ఆప్ డూయింగ్ బిజినెస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు సీఎం. దీని కారణంగా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.
ఆయన ప్రపంచ పారిశ్రామిక నాయకులతో వరుస సమావేశాలు నిర్వహించారు. అనకాపల్లిలో ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్‌కు ఫిబ్రవరి 15 తర్వాత శంకుస్థాపన చేయనున్నట్లు ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ప్రకటించారు. డబ్ల్యూఈఎఫ్ వేదికలోని ఏపీ లాంజ్‌లో ముఖ్యమంత్రి అనకాపల్లిలో ప్రతిపాదిత ప్లాంట్‌పై పురోగతిని సమీక్షించడానికి ఆర్సెలర్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్‌ను కలిశారు. సుమారు రూ. 60,000 కోట్ల ప్రారంభ పెట్టుబడితో కూడిన ఈ ప్రాజెక్ట్, ఉత్తర ఆంధ్ర భవిష్యత్ వృద్ధికి ఒక ప్రధాన పారిశ్రామిక కేంద్రంగా నిలుస్తుందని అన్నారు సీఎం. ప్రతిపాదిత శంకుస్థాపనకు చాలా ముందుగానే అన్ని చట్టబద్ధమైన అనుమతులు పూర్తి చేయాలని ఆదేశించారు.
ప్రభుత్వ మద్దతు లేదా అనుమతులు ఇవ్వడంలో ఎలాంటి జాప్యం ఉండకూడదు. అవసరమైతే, బృందాలు ఢిల్లీకి వెళ్లి అన్ని కేంద్ర అనుమతులను వేగంగా పొందాలని స్పష్టం చేశారు నారా చంద్రబాబు నాయుడు. ఈ ప్రక్రియను నిశితంగా పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి మంత్రులు నారా లోకేష్, టిజి భరత్‌లకు బాధ్యతలు అప్పగించారు.
















