హైదరాబాద్ : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సీ ఏ ) కీలక ప్రకటన చేసింది. గత సీజన్లో సువర్ణ సారథ్యంలో హైదరాబాద్ అండర్-19 మహిళా జట్టు వన్డే టోర్నమెంట్లో నాకౌట్ దశకు అర్హత సాధించింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మహిళా ఎంపిక కమిటీ చైర్ పర్సన్‌గా బి.ఆర్. సువర్ణ లక్ష్మిని 2026-27 సీజన్‌కు నియమించినట్లు హెచ్ సీ ఏ ప్రకటించింది. అంతే కాకుండా ఆమెతో పాటు అనితా మిశ్రా, జి. సంగీత, ఎం. కీర్తన , ఏక్తా సక్సేనా ఈ ఎంపిక కమిటీలోని ఇతర సభ్యులుగా ఉంటారని తెలిపింది. సింగిల్ మెంబర్ కమిటీ (జస్టిస్ నవీన్ రావు) దీనికి ఆమోదం తెలిపింది అని వెల్లడించింది. ఈ విషయాన్ని అధికారికంగా తెలిపారు హెచ్ సీ ఏ కార్యదర్శి ఎం. జీవన్ రెడ్డి .
అర్హులైన ప్రతిభావంతులను గుర్తించి, సీనియర్ , జూనియర్ మహిళా జట్లలో హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని కల్పించడంలో ఈ కమిటీ అత్యున్నత ప్రమాణాలతో కూడిన నిష్పాక్షికత, పారదర్శకత, నిజాయితీ ,వృత్తిపరమైన నైపుణ్యంతో తన బాధ్యతలను నిర్వర్తిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో మహిళా క్రికెట్ వ్యవస్థను బలోపేతం చేయడంలో మహిళా ఎంపిక కమిటీ కీలక పాత్ర పోషిస్తుంది. చైర్పర్సన్ , సభ్యులందరికీ వారి పదవీకాలంలో విజయం చేకూరాలని కోరుకుంటున్నాను. అలాగే రాష్ట్రంలో మహిళా క్రికెట్ నిరంతర వృద్ధి , అభివృద్ధికి వారి విలువైన సహకారం ఉంటుందని ఆశిస్తున్నాను అని ఆయన జోడించారు.
గత సీజన్లో సువర్ణ సారథ్యంలో, హైదరాబాద్ అండర్-19 మహిళా జట్టు వన్డేలలో నాకౌట్ దశకు చేరుకోగా, అండర్-15 బాలికల జట్టు T20 టోర్నమెంట్లో నాకౌట్ దశకు అర్హత సాధించింది. అలాగే, అండర్-19 జట్టు నుండి ఐదుగురు బాలికలు NCA క్యాంప్‌కు ఎంపికయ్యారు. ఒకరు భారత అండర్-19 జట్టుకు ఎంపికయ్యారు. అండర్-15 జట్టు నుండి ఒక బాలిక NCA క్యాంప్‌కు ఎంపికైంది. సీనియర్ మహిళా జట్టు నుండి నలుగురు క్రీడాకారిణులు సౌత్ జోన్ జట్టులో స్థానం దక్కించుకోగా, నలుగురు బాలికలు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌కు ఎంపికయ్యారు.



















