అమరావతి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్సీపీ) నాయకుల బృందం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేథాను కలిసింది. దాడులు, బెదిరింపులు , నామినేషన్ పత్రాలను ధ్వంసం చేసిన ఘటనలకు సంబంధించిన వీడియో సాక్ష్యాలను సమర్పించింది. 22 పట్టణ స్థానిక సంస్థల్లో తమ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకున్నారని, కాబట్టి అక్కడ మళ్లీ నామినేషన్ ప్రక్రియను చేపట్టాలని లేదా ఎన్నికలను వాయిదా వేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ను కోరింది. వైఎస్సార్సీపీ నాయకుల బృందం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేథాను కలిసి వినతి పత్రం సమర్పించింది. దాడులు, భయభ్రాంతులకు గురి చేయడం, నామినేషన్ పత్రాలను చింపివేయడం వంటి ఘటనలకు సం బంధించిన వీడియో సాక్ష్యాలను అందజేసింది. ఎమ్మెల్సీ , పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే టి.జె.ఆర్. సుధాకర్ బాబు, నారాయణ మూర్తి , ఇతర నాయకులు సీఈఓను కలిసిన వారిలో ఉన్నారు.
ఆధారాలకు సంబంధించి ఒక పెన్ డ్రైవ్లో సాక్ష్యాలను , మూడు వినతి పత్రాలను కమిషనర్ అనిల్ చంద్ర పునేఠాకు సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు లేళ్ల అప్పిరెడ్డి. ఓటమి భయంతో టీడీపీ కార్యకర్తలు ప్రతిపక్ష అభ్యర్థుల నామినేషన్ పత్రాలను చింపి వేశారని, వారికి పోలీసులు సహకరించారని, కొన్ని చోట్ల పోలీసులే స్వయంగా పత్రాలను లాగేసుకున్నారని ఆరోపించారు. పార్టీ సమర్పించిన వివరాల ప్రకారం, ఈ 22 స్థానిక సంస్థల్లోని మొత్తం 809 వార్డులు/డివిజన్లలో వైఎస్సార్సీపీ అభ్యర్థులు కేవలం 321 చోట్ల మాత్రమే నామినేషన్లు దాఖలు చేయగలిగారు, మిగిలిన 488 చోట్ల నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. అలాగే, ఎనిమిది మున్సిపల్ చైర్పర్సన్ స్థానాలకు కూడా నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని వాపోయారు. మైదుకూరులో 19 నామినేషన్ పత్రాలను ధ్వంసం చేసిన ఘటనలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నికలను వాయిదా వేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇదే తరహాలో ఈ 22 పట్టణ స్థానిక సంస్థల్లో కూడా చర్యలు తీసుకోవాలని అప్పిరెడ్డి డిమాండ్ చేశారు.

















