YS Jagan : మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) పర్యటనలో అపశ్రుతులు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే ఆయన కాన్వాయ్ ఢీకొనడంతో ఓ వృద్ధుడు మరణించిన ఘటన కాస్త సమసిపోకముందే, మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన విషాద సంఘటన గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో చోటుచేసుకుంది.
YS Jagan Tour – 1 Death
సత్తెనపల్లి గడియారం స్తంభం వద్ద పార్టీ కార్యకర్త జయవర్ధన్ రెడ్డి ఒక్కసారిగా సొమ్మసిల్లి కిందపడిపోయారు. వెంటనే అతనిని ఆస్పత్రికి తరలించినా, అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. జయవర్ధన్ రెడ్డి సత్తెనపల్లి వాసిగా, స్థానికంగా ఆటోమొబైల్ షాపు నిర్వహిస్తున్న వ్యక్తిగా గుర్తించారు.
జగన్ రాకతో గడియారం స్తంభం వద్ద తీవ్ర గందరగోళం నెలకొనగా, ఒత్తిడికి లోనైన జయవర్ధన్ ఊపిరాడక కుప్పకూలారు. కాన్వాయ్ వెళ్లిపోయిన తర్వాతే ఆయన కిందపడ్డ విషయం గ్రహించిన తోటి కార్యకర్తలు హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మరణించారని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి.
ఇక, ఇదేరోజు ఉదయం ఏటుకూరు వద్ద మరో విషాదం చోటుచేసుకుంది. అక్కడ వృద్ధుడు సింగయ్యను జగన్ ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లోని వాహనం ఢీకొట్టింది. నడుచుకుంటూ వెళ్తున్న సింగయ్య ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. అయితే ఈ ప్రమాదం జరిగిన తరువాత కూడా జగన్ కాన్వాయ్ ఆగకుండా వెళ్లిపోయిందని, వైఎస్సార్సీపీ నేతలు పట్టించుకోలేదని స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వందలాది వాహనాలతో నిబంధనలకు విరుద్ధంగా జగన్ కాన్వాయ్ సాగిన నేపథ్యంలో ఇప్పటికే రెండు ప్రాణాలు పోయినాయి. పోలీసులు ముందుగానే వందమందికే అనుమతి ఇస్తామని ప్రకటించినప్పటికీ వేలాది మంది కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. దీని వల్ల ఏర్పడిన గందరగోళం ప్రాణాలు తీసేలా మారిందని పల్నాడు జిల్లాలో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. జగన్ పర్యటన పేరుతో ఈ విధంగా చావులు చోటుచేసుకోవడాన్ని ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు.
Also Read : Hero Havish -Trinadha Rao Nakkina : యంగ్ హీరో ‘హవీష్’ కాంబోలో ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్


















