అమెరికా : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు యువతను ఉద్దేశించి. అమెరికా పర్యటనలో భాగంగా ఆయన యుఎస్ లోని కొలంబియా యూనివర్సిటీ ‘ఫైర్ సైడ్ చాట్’లో కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. భారతీయ యువత ఉద్యోగాల కోసం ఎదురు చూడొద్దని కోరారు. పారిశ్రామికవేత్తలు, అంత్రప్రెన్యూర్లుగా మారి ఉద్యోగాలు సృష్టించే స్థాయికి ఎదగాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ధైర్యంగా, ఆత్మ విశ్వాసంతో ముందుకెళ్లి అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఉద్బోధించారు. కొలంబియా యూనివర్సిటీలో ఫైర్ సైడ్ చాట్‌లో నిరుద్యోగం, స్టార్టప్‌ల స్థాపన, యువత, గెలుపోటములపై తన అభిప్రాయాలు పంచుకొన్నారు. కొలంబియా బిజినెస్ స్కూల్ 21వ వార్షిక సదస్సులో ప్రసంగించిన అనంతరం ప్రత్యేక చర్చాగోష్ఠిలో పాల్గొన్నారు.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, పారిశ్రామిక రంగాలు, భారతదేశ ప్రగతిని క్లుప్తంగా వివరించారు. భారత ఆర్థిక గమనం, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, వ్యవస్థాపకత, లైఫ్ సైన్సెస్, మారుతున్న ఉద్యోగాల శైలి, నాయకత్వ లక్షణాలు ఇతరత్రా అంశాలపై లోతైన విశ్లేషణలను విద్యార్థులతో పంచుకున్నారు. గడిచిన దశాబ్ద కాలంలోనే భారతదేశం భౌతిక, సాంకేతిక, మౌలిక సదుపాయాల రంగాల్లో అద్భుతమైన ప్రగతి సాధించిందని కేటీఆర్ పేర్కొన్నారు. 3జీ, 4జీ, 5జీ లాంటి టెలికాం సాంకేతికతలను భారత్ ప్రపంచ దేశాల కంటే ముందే అంది పుచ్చుకున్నదని గుర్తు చేశారు. ప్రస్తుతం భారత్ ఒక కీలక దశలో ఉన్నదని వ్యాఖ్యానించారు. ప్రపంచంలోని ఇతర దేశాల అభివృద్ధి నమూనాలను, వారి విధానాలను ఉన్నది ఉన్నట్టుగా కాపీ కొట్టే పరిస్థితి లేదని నొక్కి చెప్పారు. ఇలాంటి తరుణంలో మనం సొంతంగా, వినూత్నంగా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందని స్పష్టం చేశారు.
