అమరావతి : టీడీపీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ నిప్పులు చెరిగారు. ఆయన వైసీపీని, ఆ పార్టీ చీఫ్ జగన్ రెడ్డిని ఏకి పారేశారు. డీఎస్సీ సక్సెస్‌పై వైసీపీ అబద్ధాల ఫ్యాక్టరీ నడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయాల్లో విమర్శలకు హద్దులు, హుందాతనం ఉండాలని, తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ వ్యక్తిగత దూషణలకు పాల్పడలేదని, విధానాలపైనే రాజకీయ పోరాటం చేసిందని అన్నారు. ప్రతీకారం, విధ్వంసం, అసత్య ప్రచారాలు అనే పునాదులపైనే వైసీపీ రాజకీయాలు నిర్మితమయ్యాయని ఆయన దుయ్యబట్టారు. 2019-2024 వరకు రాష్ట్రంలో కొత్త ఉద్యోగ అవకాశాల కల్పన పూర్తిగా నిలిచి పోయిందని విమర్శించారు. ప్రతి జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి, నిరుద్యోగ యువతను మోసం చేశారని ఆరోపించారు.
ఐదేళ్ల పాలనలో ఒక్క జాబ్ క్యాలెండర్ గానీ, ఒక్క డీఎస్సీ గానీ విడుదల చేయలేదని తప్పుబట్టారు. 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన పరిశ్రమలను వైసీపీ ప్రభుత్వం తరిమి వేసిందని, ఫలితంగా ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు రెండూ లేక యువత ఐదేళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొందని ఆవేదన వ్యక్తం చేశారు. నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గం నుంచి ఉద్యోగాల కోసం వేలాది వినతులు వచ్చాయని గుర్తు చేశారు. నిరుద్యోగ యువత అభ్యర్థన మేరకు కుప్పం వేదికగా చంద్రబాబు నాయుడు మెగా డీఎస్సీపై తొలి సంతకం చేస్తానని హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ మాట నిలబెట్టుకున్నారని తెలిపారు. డీఎస్సీని అడ్డుకునేందుకు వందకు పైగా కోర్టు కేసులు దాఖలైనా ప్రభుత్వం వెనక్కి తగ్గలేదని అన్నారు. నారా లోకేష్ పర్యవేక్షణలో డీఎస్సీ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించారని పేర్కొన్నారు.

















