అమరావతి : ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాల్టి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏఐ టెక్నాలజీతో ఏపీ టూరిజంలో కొత్త శకం ప్రారంభమైందన్నారు. 2027 గోదావరి పుష్కరాలే లక్ష్యంగా ‘ది గోదావరి కాల్స్’ పేరుతో ప్రచారం చేపట్టామన్నారు . సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, క్రియేటర్లతో ఏపీ టూరిజంపై ప్రత్యేక ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేరళ కోవాళం తరహాలో ఏపీ తీరంలో వెల్ నెస్ సెంటర్లు – ఆయుర్వేదం, యోగాలకు పెద్దపీట వేస్తున్నామన్నారు. పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదాతో ఊతం.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల చొరవతో ఏపీలో ఇన్వెస్టర్లు క్యూ కడుతున్నారని చచెప్పారు. కేంద్రంతో సత్సంబంధాలు, భారీ ప్రాజెక్టుల సాధన.. తిరుపతి, విశాఖలను గ్లోబల్ టూరిజం హబ్‌లుగా మారుస్తున్నామని పేర్కొన్నారు మంత్రి కందుల దుర్గేష్.
తొలిసారిగా రాజమహేంద్రవరం వేదికగా ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా ప్రారంభించామన్నారు. అంతర్జాతీయ పర్యాటక దినోత్సవ వేడుకల వివరాలను వెల్లడించారు. కేవలం రాజమండ్రిలోనే కాకుండా రాష్ట్రంలోని ప్రతి జిల్లా కేంద్రంలోనూ ఈ వేడుకలను అధికారికంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పర్యాటక రంగానికి సంబంధించి కొత్త కార్యాచరణతో ‘రాజమండ్రి డిక్లరేషన్’ను ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు సాంప్రదాయ పద్ధతుల్లో సాగిన పర్యాటకాభివృద్ధిని, ఇకపై పూర్తిగా సాంకేతిక ఆధారితంగా మారుస్తున్నట్లు మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు . రాష్ట్రంలోని 130 పర్యాటక ప్రాంతాల్లో 130 భాషల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ ద్వారా ఆయా ప్రాంతాల సమాచారాన్ని, ప్రాశస్త్యాన్ని పర్యాటకులకు అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించారు.
పర్యాటక ప్రాంతాలకు వచ్చే యాత్రికులు ఒకటి రెండు రోజులతో సరిపెట్టకుండా, మూడు నాలుగు రోజులు అక్కడే ఉండేలా ఆకర్షించేందుకు క్రియేటర్లతో, ఇన్ఫ్లూయెన్సర్లతో ప్రత్యేక డాక్యుమెంటరీలు చేయించి ప్రదర్శించడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో మంత్రి దుర్గేష్ పర్యాటక శాఖాధికారులతో కలిసి రాజమహేంద్రవరం నుండి హాఫ్ ఆన్ హాఫ్ ఆఫ్ డబుల్ డెక్కర్ బస్సులను అధికారికంగా జెండా ఊపి ప్రారంభించారు. ఆ బస్సుల్లో ఇన్ఫ్లూయెన్సర్లు రాజమహేంద్రవరం సమీపంలోని వివిధ పర్యాటక ప్రాంతాలను సందర్శించి మంచి రీల్స్ తయారు చేసి విశ్వవ్యాప్తం చేస్తారని తెలిపారు. పర్యాటక ప్రాంతాల ప్రచారంలో సోషల్ ఇన్ ఫ్లూయెన్సర్ల పాత్ర కీలకం అన్నారు. ఈ ప్రాంతంలో జరిగే పర్యాటకాభివృద్ధి ప్రతి ఒక్కరికీ తెలియ జేయాలన్నారు. అంతేగాక గోదావరి మాతకు ఇచ్చే హారతిని తిలకించాలన్నారు.
















