ముందుగానే రణబీర్ కపూర్ ‘రామాయణం విడుదల..?

న‌వంబ‌ర్ 5 లేదా 6వ తేదీన ప్రేక్ష‌కుల ముందుకు

hellotelugu-Ramayana

హైద‌రాబాద్ : దేశ వ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం రణబీర్ కపూర్ కీ రోల్ పోషించిన‌ ‘రామాయణం’ పార్ట్ 1 మూవీ గురించి కీల‌క అప్ డేట్ వ‌చ్చింది. అయితే అనుకున్న సమయం కంటే ముందే థియేటర్లలోకి రావచ్చ‌ని సినీ వ‌ర్గాల నుంచి అందిన విశ్వ‌సనీయ స‌మాచారం. వాస్తవానికి ఈ సినిమా నవంబర్‌లో విడుదల కావాల్సి ఉంది, అయితే చిత్ర బృందం విడుదల తేదీని ముందుకు జరపాలని ఆలోచిస్తున్నట్లు టాక్. తాజా సమాచారం ప్రకారం ‘రామాయణం’ పార్ట్ 1 నవంబర్ 5 లేదా నవంబర్ 6న విడుదలయ్యే అవకాశం ఉంది. మొదట ఈ సినిమా భారతదేశంలో నవంబర్ 8 ప్రాంతంలో విడుదలవుతుందని భావించారు. అయితే దీపావళి పండుగ సందడి కారణంగా థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్యపై ప్రభావం పడకుండా ఉండేందుకు చిత్ర నిర్మాతలు ముందుగానే సినిమాను విడుదల చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణుడిగా నటిస్తున్నారు. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ చిత్రం అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న భారతీయ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. చిత్ర బృందం భారీ స్థాయిలో ప్రచార కార్యక్రమాలను కూడా ప్లాన్ చేస్తోంది. ముఖ్యంగా యువ ప్రేక్షకులకు చేరువయ్యేందుకు సోషల్ మీడియా క్రియేటర్లు, డిజిటల్ ఇన్‌ఫ్లుయెన్సర్లపై వారు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. అంతిమ విడుదల తేదీపై అధికారిక ప్రకటన కోసం ఇంకా వేచి చూడాల్సి ఉంది. ఇప్ప‌టికే రామాయ‌ణం – పార్ట్ 1 చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున ఎదురు చూస్తున్నారు.

Exit mobile version