న్యూఢిల్లీ : ఓ వైపు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినా ఆయన స్థానంలో ఇంకో ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన వ్యక్తి ప్రహ్లాద్ జోషికి అప్పగించారు మోదీ. ఈ సందర్బంగా లోక్ సభలో వాడి వేడి చర్చ జరిగింది . ప్రతిపక్ష నాయకుడు , ఎంపీ రాహుల్ గాంధీ సీరియస్ కామెంట్స్ చేశారు. ఇది ముమ్మాటికీ ప్రజాస్వామ్యం కానే కాదన్నారు. పేపర్ లీక్ వెనుక చాలా మంది హస్తం ఉందని, కానీ కొందరినే అరెస్ట్ చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. విద్యార్థి నిరసనకారులపై పోలీసులు జరిపినట్లు ఆరోపించబడిన అణచివేతకు సంబంధించి తమ డిమాండ్లను ప్రభుత్వం పట్టించు కోవడం లేదని ఆరోపించారు రాహుల్ గాంధీతో పాటు మరికొంతమంది ఎంపీలు. కాగా లోక్‌సభలో జరిగిన వాడివేడి చర్చ అనంతరం పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు- 2026 ఆమోదించబడింది. ఈ చర్చలో అధికార, ప్రతిపక్ష బెంచీలు రెండూ పేపర్ లీక్‌లపై కఠిన చర్యలకు మద్దతు తెలిపాయి.
కానీ నీట్ వివాదాన్ని ప్రభుత్వం నిర్వహించిన తీరు, విద్యార్థి నిరసనకారులపై పోలీసుల చర్యపై తీవ్రంగా విభేదించాయి. ఈ బిల్లును ప్రవేశ పెడుతూ కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడారు. అనుభవం నుండి పాఠాలు నేర్చుకుని 2024లో అమల్లోకి వచ్చిన పేపర్ లీక్ నిరోధక చట్టాన్ని బలోపేతం చేయాలనే ప్రభుత్వ సంకల్పాన్ని ఈ సవరణలు ప్రతిబింబిస్తున్నాయని అన్నారు. ప్రస్తుత చట్టం కింద 52 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని, పరీక్షల మోసంలో పాల్గొన్న వారిపై కేంద్రం వేగంగా చర్యలు తీసుకుందని ఆయన నొక్కి చెప్పారు. నిర్మాణాత్మక సూచనలు ఇవ్వకుండా ప్రతిపక్షాలు ఈ అంశాన్ని రాజకీయం చేస్తున్నాయని కూడా సింగ్ ఆరోపించారు.
ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ నీట్ పేపర్ లీక్‌పై నిరసనలకు నాయకత్వం వహించిన విద్యార్థులను ప్రశంసించారు. పరీక్షల సమగ్రతపై దృష్టిని ఆకర్షించడం ద్వారా వారు దేశ భవిష్యత్తును కాపాడారని అన్నారు. విద్యార్థులు పోషించిన పాత్రను అన్ని రాజకీయ పార్టీలు అభినందించాలని సూచచించారు. భారతదేశ విద్యా వ్యవస్థ ఖరీదైనదని, పేపర్ లీక్‌లు కుటుంబాలపై తీవ్రమైన మానసిక, ఆర్థిక కష్టాలను కలిగిస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిరసనకారులపై పోలీసుల చర్యను గాంధీ ప్రశ్నించారు. ఇటువంటి బలప్రయోగానికి ప్రధానమంత్రి లేదా కేంద్ర హోం మంత్రి మాత్రమే అధికారం ఇవ్వగలరని వాదించారు. విద్యార్థులకు అసలైన శత్రువు కేవలం మాజీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాత్రమే కాదని, ఆర్ఎస్ఎస్ అని కూడా ఆయన ఆరోపించారు.


















