చెన్నై : ఐపీఎల్ 2026లో అత్యంత చెత్త ప్రదర్శనతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటూ వచ్చిన చెన్నై సూపర్ కింగ్స్ స్కిప్పర్ రుతురాజ్ గైక్వాడ్ ఎట్టకేలకు గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో ఫామ్ లోకి వచ్చాడు. ఓ వైపు టపా టపా వికెట్లు కోల్పోతున్నా ఎక్కడా తొందరపాటుకు గురి కాకుండా మ్యాచ్ చివరి దాకా ఉన్నాడు. దీంతో సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 158 రన్స్ చేసింది. రుతురాజ్ గైక్వాడ్ 60 బంతుల్లో 74 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇందులో 6 ఫోర్లు 4 సిక్సులు ఉన్నాయి. అనంతరం గుజరాత్ 16.4 ఓవర్లలోనే పని కానిచ్చేసింది. సాయి సుదర్శన్ 46 బంతుల్లో 87 రన్స్ చేశాడు. ఇందులో 4 ఫోర్లు 7 భారీ సిక్సులు ఉన్నాయి.
ఇక గుజరాత్ టైటాన్స్ బౌలర్లు చుక్కలు చూపించారు సీఎస్కేకు. మొదట రబాడా 4 ఓవర్లలో కేవలం 25 రన్స్ మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. అర్షద్ ఖాన్ 43 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీశాడు. సాయి సుదర్శన్ తో పాటు జోస్ బట్లర్ 30 బంతుల్లో 39 నాటౌట్ గా నిలిచాడు. ఇందులో 4 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి. ఇక స్కిప్పర్ శుభ్‌మన్ గిల్ 23 బంతుల్లో 33, 1 ఫోర్, 3 సిక్సులతో రెచ్చి పోయాడు. కానీ వికెట్ కీపర్ సంజు శాంసన్ సూపర్ స్టంపింగ్ తో ఝలక్ ఇచ్చాడు.
ఇదిలా ఉండగా ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో సీఎస్కేను దాటేసింది. మరో వైపు పంజాబ్ కింగ్స్ ఎలెవన్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ఇప్పటికే పాయింట్ల పట్టికలో టాప్ లోకి దూసుకు పోయాయి. ఇక నాలుగో స్థానం కోసం పలు జట్లు పోటీ పడుతున్నాయి.
