తిరుపతి: తిరుపతిని స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దుతామనే యువగళం హామీ కార్యరూపం దాలుస్తోంది. తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో ఏడాదిలో రూ.35 కోట్లకు పైగా నిధులు కేటాయించడం జరిగింది. ఈ నేపథ్యంలో బుధవారం తిరుపతి పట్టణం గొల్లవానిగుంటలో నూతనంగా నిర్మించిన ఎన్టీఆర్ క్రికెట్ పెవిలియన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, అకాడమీలను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. శాప్, తుడా సహకారంతో రూ.10.10 కోట్ల నిధులు వెచ్చించి ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను నిర్మించారు. ముందుగా క్రీడా ప్రాంగణానికి చేరుకున్న మంత్రి నారా లోకేష్ కు శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు. అనంతరం ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ తో పాటు క్రికెట్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బాల్ బ్యాడ్మింటన్, ఆర్చరీ అకాడమీలను మంత్రి లోకేష్ ప్రారంభించారు.
క్రీడా ప్రాంగణం మొత్తం కలియ తిరిగారు. ఈ సందర్భంగా క్రికెట్, కబడ్డీ, కోకో, వాలీబాల్, బాల్ బ్యాడ్మింటన్, ఆర్చరీ క్రీడాకారులతో గ్రూప్ ఫోటో దిగారు. కొద్దిసేపు వాలీబాల్ ఆడి క్రీడాకారులను ఉత్సాహ పరిచారు. అనంతరం ఎన్టీఆర్ క్రికెట్ స్టేడియంతో పాటు ఎన్టీఆర్ క్రికెట్ పెవిలియన్ ను ప్రారంభించారు. భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాల్ రాజ్, ఇతర క్రీడాకారులతో కలిసి కొద్దిసేపు క్రికెడ్ ఆడారు. ఈ సందర్భంగా స్కూల్ విద్యార్థులతో సంభాషించి వారిని ఉత్సాహ పరిచారు. క్రీడా ప్రాంగణంలో ప్రణీత్ ఫౌండేషన్ సహకారంతో ఏర్పాటుచేసిన వాటర్ ప్లాంట్ ను మంత్రి ప్రారంభించారు. ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను క్రికెట్ మైదానం, ఖోఖో, కబడ్డీ, ఖఖో, వాలీబాల్, బాల్ బ్యాడ్మింటన్, ఆర్చరీ కోర్టులతో పాటు పలు క్రీడా సౌకర్యాలతో అభివృద్ధి చేశారు. ఈ సముదాయం క్రీడా సంస్కృతిని ప్రోత్సహించడంతో పాటు ఈ ప్రాంత భవిష్యత్ క్రీడాకారులను తీర్చిదిద్దడంలో కీలకపాత్ర పోషించనుంది.
